unidentified murder
-
గన్నీ బ్యాగు, చెత్తకుప్పలో మృతదేహాలు.. ఇంకా మిస్టరీలే!
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని డెయిరీ ఫామ్ వద్ద ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చిన సూట్‌కేసులో శవం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసు కొన్ని గంటల్లోనే కొలిక్కి రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 2018లో గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలోని బొటానిక్గార్డెన్ వద్ద మూటలో లభించిన గర్భవతి పింకీ హత్య కేసును సైబరాబాద్ అధికారులు కొన్ని రోజుల్లో ఛేదించారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో మృతదేహాలుగా, ముక్కలుగా దొరికి... ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ కొలిక్కి చేరని కేసులు ఎన్నో ఉన్నాయి. కొన్నింటిలో హంతకుల మాట అటుంచితే...అసలు హతులు ఎవరైందీ పోలీసులు గుర్తించలేకపోయారు. ఆ కేసులను ఇప్పటికీ పోలీసులు సైతం మర్చిపోయారు. అలాంటి ఉదంతాల్లో మచ్చుకు కొన్ని... కేస్–1: సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం మెహిదీపట్నం ప్రధాన బస్టాప్‌లో పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం.12 ఎదురుగా ఉన్న బస్‌షెల్టర్ నెం.3 వద్దకు 2010 ఆగస్టు 3 మధ్యాహ్నం టోలిచౌకి వైపు నుంచి ఓ ఇండికా కారు వచ్చి ఆగింది. తొలుత అందులో నుంచి ఓ యువతి కిందికి దిగింది. వెనక్కు వెళ్లి కారు డిక్కీ తెరిచి అందులో నుంచి సూట్‌కేస్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించింది. అయితే అది బరువుగా ఉండటంతో డ్రైవర్‌ను పిలిచి అతని సహాయంతో కిందికి దించి బస్టాప్‌లోకి చేర్చింది. అదే కారులోంచి దిగిన మరో మహిళతో కలిసి ఆ సూట్‌కేస్ పక్కనే బస్టాప్‌లో కాసేపు కూర్చుంది. అలా కాసేపు కూర్చున్న ఇద్దరూ అదే కారులో వెళ్లిపోయారు. ఆటోడ్రైవర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సూట్‌కేస్ తెరిస్తే అందులో మహిళ శవం లభించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఆ మహిళ ఎవరు? చంపింది ఎవరు? అనేది తేలలేదు. ఈ ఉదంతం జరిగి ఆదివారానికి: 10 ఏళ్ల 8 నెలల 5 రోజులు కేస్–2: మొండెం,కాళ్లు లభించాయి.. కానీ తల? సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలోని రామ్‌కోఠి చౌరస్తాలోని సిద్ధార్థ ఏజెన్సీస్ వద్ద 2010 డిసెంబర్ 20న ఉదయం ఓ మృతదేహం ‘ముక్కలుగా’ లభించింది. ఓ ప్లాస్టిక్ సంచిలో తల, కాళ్లు లేని మొండెం కనిపించింది. మృతదేహాన్ని బట్టి మృతుడి వయస్సు 16 నుండి 20 ఏళ్ళ మధ్య ఉంటుందని నిర్థారించారు. సర్జికల్ బ్లేడ్‌తో తల, కాళ్ళు కోసినట్లు ఫోరెన్సిక్ వైద్యులు తేల్చారు. ఇది జరిగిన రెండు రోజులకు నారాయణగూడ ఠాణా పరిధిలో రోడ్డు పక్కగా రెండు కాళ్లు లభించాయి. వీటిని పరిశీలించిన ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్ వైద్యులు ఆ మొండేనికి సంబంధించినవే అని తేల్చారు. దాని తల ఇప్పటికీ లభించకపోగా... ఆ కేసు సైతం కొలిక్కి రాలేదు. ఈ ఉదంతం జరిగి ఆదివారానికి: 10 ఏళ్ల 22 రోజులు కేస్–3: గన్నీ బ్యాగులో మృతదేహం వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో 2012 జూన్ 28న మరో డెడ్‌బాడీ బయటపడింది. నిలబెట్టి ఉన్న ప్లాస్టిక్ డ్రమ్‌ను చిత్తుకాగితాలు ఏరుకునే వ్యక్తులు గుర్తించారు. తీసుకువెళ్దామనే ఉద్దేశంతో దాన్ని పరికించి చూడగా డ్రమ్ పైభాగంలో తెలిరిచి ఉన్న ప్రాంతంలో ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్‌లతో పార్సిల్ చేసి టేప్ వేసినట్లు గుర్తించారు. వీటిని తొలగించగా అందులో శవం ఉన్నట్లు బయటపడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసూ కొలిక్కి చేరలేదు. వికలాంగుడైన హతుడిది నల్లగొండ, మహబూబ్‌నగర్ అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఉదంతం జరిగి ఆదివారానికి: 8 ఏళ్ల 6 నెలల 14 రోజులు కేస్–4: చెత్తకుప్పలో శవం అబిడ్స్ ఠాణా పరిధిలోని ఎంజే మార్కెట్ ప్రాంతంలో 2013 జూలై 21 ఉదయం వెలుగులోకి వచ్చిన చెత్తకుప్పలో శవం ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఓ మధ్యవయస్కుడిని హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని పాలథీన్ సంచిలో పార్శిల్ చేసి తెచ్చి చెత్తకుప్పలో పడేశారు. మృతదేహం కాళ్లకు ట్రాన్స్‌పోర్టు కంపెనీల్లో వినియోగించే నైలాన్ తాడు కట్టి ఉంది. ప్రాథమికంగా హతుడి ఆచూకీ కనిపెట్టడానికి సెంట్రల్ జోన్ పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. హర్యానాలోని పానిపట్ ప్రాంతం నుంచి వలసవచ్చి హఫీజ్‌పేటలో నివసించిన రామ్‌కుమార్ మృతదేహంగా తేలింది. కేసు మాత్రం కొలిక్కి రాకపోవడంతో నిందితులు ఇప్పటి వరకు చిక్కలేదు. ఈ ఉదంతం జరిగి ఆదివారానికి: 7 ఏళ్ల 5 నెలల 21 రోజులు -
ఈ కాళ్లు ఎవరివో?
పొందూరు, జి.సిగడాం: గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసి చెరుకు తోటలో తగలబెట్టిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సంఘటన స్థలంలో మృతదేహం మొత్తం కాలిపోగా, రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. హతుడెవరో.. హంతకులెవరో తెలియరావడంలేదు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... పొందూరు మండలం బురిడి కంచరాం, ధర్మపురం గ్రామాల మధ్యలోని చెరుకు తోటలో గుర్తుతెలియని వ్యక్తిని, గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి తగుల బెట్టారు. మొదలవలస సన్యాసిరావు అనే రైతుకు చెందిన చెరుకుతోటలో పని చేసేందుకు సోమవారం ఉదయం వ్యవసాయకూలీలు వెళ్లగా, అక్కడ తగల బెట్టిఉన్న మృత దేహాన్ని గమనించారు. వారు గ్రామస్తులకు చెప్పటంతో, గ్రామస్తులు పొందూరు పోలీసులకు సమాచారం అందజేశారు. గ్రామ రెవెన్యూ అధికారి ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య, సాక్షాలు తారుమారు సెక్షన్ల కింద కేసునమోదు చేశారు. మృతదేహాన్ని ఆది రాత్రి తగులబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తుండగా, సంఘటన స్థలంలో మృత దేహాన్ని కాల్చేందుకు పెట్రోల్, కిరోసిన్, టైర్లు వినియోగించి నట్లు తెలుస్తోంది. కత్తి, మద్యం బాటిళ్లు, కాలిన టైర్ల ఆనవాళ్లు కూడా ఉన్నాయి. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా కాలిపోగా, కాళ్లు మాత్రం సగం కాలి మిగిలి ఉన్నాయి. మృతుడు ఎవ్వరనేదీ గుర్తించే అవకాశాలు కనిపించటం లేదు. పథకం ప్రకారమే.. చెరుకు తోటలకు రహదారి 200 మీటర్ల దూరాన ఉంటుంది. వాహనంలో బతికున్న వ్యక్తిని తీసుకొచ్చి సజీవంగా తగులబెట్ట టం కష్టం. ఎక్కడో చంపి, మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి మో సుకువచ్చి, పథకం ప్రకారం మృతదేహం తగులబెట్టేందుకు అవసరమైన సామగ్రిని సైతం తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీనితో పోలీసులు జిల్లాలోని ఎక్కడైనా అదృశ్యం కేసులు ఇటీవల నమోదయ్యాయా అన్న కోణంలో పరిశీస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి ఆడా, మగా అన్న అంశం కూడా తెలియం లేదు. కాళ్ల ఆనవాళ్లను బట్టి పురుషుడే అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సంఘన స్థలాన్ని పరిశీలించిన జేఆర్ పురం సీఐ సాకేటి విజయ్ కుమార్, పొందూరు ఎస్సై ఆర్‌హెచ్‌ఎన్‌వి కుమార్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ పరిశీలించాయి. ప్రాథమికంగా 302(హత్య), 201 (సాక్షాలు తారుమారు)సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరో పక్క ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల ఆచూకీ కోసం, హతుని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.