ఈ కాళ్లు ఎవరివో?
పొందూరు, జి.సిగడాం: గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసి చెరుకు తోటలో తగలబెట్టిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సంఘటన స్థలంలో మృతదేహం మొత్తం కాలిపోగా, రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. హతుడెవరో.. హంతకులెవరో తెలియరావడంలేదు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... పొందూరు మండలం బురిడి కంచరాం, ధర్మపురం గ్రామాల మధ్యలోని చెరుకు తోటలో గుర్తుతెలియని వ్యక్తిని, గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి తగుల బెట్టారు. మొదలవలస సన్యాసిరావు అనే రైతుకు చెందిన చెరుకుతోటలో పని చేసేందుకు సోమవారం ఉదయం వ్యవసాయకూలీలు వెళ్లగా, అక్కడ తగల బెట్టిఉన్న మృత దేహాన్ని గమనించారు.
వారు గ్రామస్తులకు చెప్పటంతో, గ్రామస్తులు పొందూరు పోలీసులకు సమాచారం అందజేశారు. గ్రామ రెవెన్యూ అధికారి ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య, సాక్షాలు తారుమారు సెక్షన్ల కింద కేసునమోదు చేశారు. మృతదేహాన్ని ఆది రాత్రి తగులబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తుండగా, సంఘటన స్థలంలో మృత దేహాన్ని కాల్చేందుకు పెట్రోల్, కిరోసిన్, టైర్లు వినియోగించి నట్లు తెలుస్తోంది. కత్తి, మద్యం బాటిళ్లు, కాలిన టైర్ల ఆనవాళ్లు కూడా ఉన్నాయి. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా కాలిపోగా, కాళ్లు మాత్రం సగం కాలి మిగిలి ఉన్నాయి. మృతుడు ఎవ్వరనేదీ గుర్తించే అవకాశాలు కనిపించటం లేదు.
పథకం ప్రకారమే..
చెరుకు తోటలకు రహదారి 200 మీటర్ల దూరాన ఉంటుంది. వాహనంలో బతికున్న వ్యక్తిని తీసుకొచ్చి సజీవంగా తగులబెట్ట టం కష్టం. ఎక్కడో చంపి, మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి మో సుకువచ్చి, పథకం ప్రకారం మృతదేహం తగులబెట్టేందుకు అవసరమైన సామగ్రిని సైతం తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీనితో పోలీసులు జిల్లాలోని ఎక్కడైనా అదృశ్యం కేసులు ఇటీవల నమోదయ్యాయా అన్న కోణంలో పరిశీస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి ఆడా, మగా అన్న అంశం కూడా తెలియం లేదు. కాళ్ల ఆనవాళ్లను బట్టి పురుషుడే అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సంఘన స్థలాన్ని పరిశీలించిన జేఆర్ పురం సీఐ సాకేటి విజయ్ కుమార్, పొందూరు ఎస్సై ఆర్‌హెచ్‌ఎన్‌వి కుమార్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ పరిశీలించాయి. ప్రాథమికంగా 302(హత్య), 201 (సాక్షాలు తారుమారు)సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరో పక్క ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల ఆచూకీ కోసం, హతుని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.