గన్నీ బ్యాగు, చెత్తకుప్పలో మృతదేహాలు.. ఇంకా మిస్టరీలే! | Hyderabad: There Are Still Many Cases That Unidentified Murders | Sakshi
Sakshi News home page

గన్నీ బ్యాగు, చెత్తకుప్పలో మృతదేహాలు.. ఇంకా మిస్టరీలే!

Published Mon, Jan 11 2021 8:43 AM | Last Updated on Mon, Jan 11 2021 9:10 AM

Hyderabad: There Are Still Many Cases That Unidentified Murders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజేంద్రనగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని డెయిరీ ఫామ్‌ వద్ద ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చిన సూట్‌కేసులో శవం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసు కొన్ని గంటల్లోనే కొలిక్కి రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 2018లో గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌ పరిధిలోని బొటానిక్‌గార్డెన్‌ వద్ద మూటలో లభించిన గర్భవతి పింకీ హత్య కేసును సైబరాబాద్‌ అధికారులు కొన్ని రోజుల్లో ఛేదించారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో మృతదేహాలుగా, ముక్కలుగా దొరికి... ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ కొలిక్కి చేరని కేసులు ఎన్నో ఉన్నాయి. కొన్నింటిలో హంతకుల మాట అటుంచితే...అసలు హతులు ఎవరైందీ పోలీసులు గుర్తించలేకపోయారు. ఆ కేసులను ఇప్పటికీ పోలీసులు సైతం మర్చిపోయారు. అలాంటి ఉదంతాల్లో మచ్చుకు కొన్ని...

కేస్‌–1: సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం
మెహిదీపట్నం ప్రధాన బస్టాప్‌లో పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నెం.12 ఎదురుగా ఉన్న బస్‌షెల్టర్‌ నెం.3 వద్దకు 2010 ఆగస్టు 3 మధ్యాహ్నం టోలిచౌకి వైపు నుంచి ఓ ఇండికా కారు వచ్చి ఆగింది. తొలుత అందులో నుంచి ఓ యువతి కిందికి దిగింది. వెనక్కు వెళ్లి కారు డిక్కీ తెరిచి అందులో నుంచి సూట్‌కేస్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించింది. అయితే అది బరువుగా ఉండటంతో డ్రైవర్‌ను పిలిచి అతని సహాయంతో కిందికి దించి బస్టాప్‌లోకి చేర్చింది. అదే కారులోంచి దిగిన మరో మహిళతో కలిసి ఆ సూట్‌కేస్‌ పక్కనే బస్టాప్‌లో కాసేపు కూర్చుంది. అలా కాసేపు కూర్చున్న ఇద్దరూ అదే కారులో వెళ్లిపోయారు. ఆటోడ్రైవర్‌ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సూట్‌కేస్‌ తెరిస్తే అందులో మహిళ శవం లభించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఆ మహిళ ఎవరు? చంపింది ఎవరు? అనేది తేలలేదు. 
ఈ ఉదంతం జరిగి ఆదివారానికి: 10 ఏళ్ల 8 నెలల 5 రోజులు 

కేస్‌–2: మొండెం,కాళ్లు లభించాయి.. కానీ తల?
సుల్తాన్‌బజార్‌ ఠాణా పరిధిలోని రామ్‌కోఠి చౌరస్తాలోని సిద్ధార్థ ఏజెన్సీస్‌  వద్ద 2010 డిసెంబర్‌ 20న ఉదయం ఓ మృతదేహం ‘ముక్కలుగా’ లభించింది. ఓ ప్లాస్టిక్‌ సంచిలో తల, కాళ్లు లేని మొండెం కనిపించింది. మృతదేహాన్ని బట్టి మృతుడి వయస్సు 16 నుండి 20 ఏళ్ళ మధ్య ఉంటుందని నిర్థారించారు. సర్జికల్‌ బ్లేడ్‌తో తల, కాళ్ళు కోసినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు తేల్చారు. ఇది జరిగిన రెండు రోజులకు నారాయణగూడ ఠాణా పరిధిలో రోడ్డు పక్కగా రెండు కాళ్లు లభించాయి. వీటిని పరిశీలించిన ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్‌ వైద్యులు ఆ మొండేనికి సంబంధించినవే అని తేల్చారు. దాని తల ఇప్పటికీ లభించకపోగా... ఆ కేసు సైతం కొలిక్కి రాలేదు.  
ఈ ఉదంతం జరిగి ఆదివారానికి: 10 ఏళ్ల 22 రోజులు

కేస్‌–3: గన్నీ బ్యాగులో మృతదేహం 
వనస్థలిపురం పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో 2012 జూన్‌ 28న మరో డెడ్‌బాడీ బయటపడింది. నిలబెట్టి ఉన్న ప్లాస్టిక్‌ డ్రమ్‌ను చిత్తుకాగితాలు ఏరుకునే వ్యక్తులు గుర్తించారు. తీసుకువెళ్దామనే ఉద్దేశంతో దాన్ని పరికించి చూడగా డ్రమ్‌ పైభాగంలో తెలిరిచి ఉన్న ప్రాంతంలో ప్లాస్టిక్‌ గన్నీ బ్యాగ్‌లతో పార్సిల్‌ చేసి టేప్‌ వేసినట్లు గుర్తించారు. వీటిని తొలగించగా అందులో శవం ఉన్నట్లు బయటపడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసూ కొలిక్కి చేరలేదు. వికలాంగుడైన హతుడిది నల్లగొండ, మహబూబ్‌నగర్‌ అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.  
ఈ ఉదంతం జరిగి ఆదివారానికి: 8 ఏళ్ల 6 నెలల 14 రోజులు  

కేస్‌–4: చెత్తకుప్పలో శవం 
అబిడ్స్‌ ఠాణా పరిధిలోని ఎంజే మార్కెట్‌ ప్రాంతంలో 2013 జూలై 21 ఉదయం వెలుగులోకి వచ్చిన చెత్తకుప్పలో శవం ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఓ మధ్యవయస్కుడిని హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని పాలథీన్‌ సంచిలో పార్శిల్‌ చేసి తెచ్చి చెత్తకుప్పలో పడేశారు. మృతదేహం కాళ్లకు ట్రాన్స్‌పోర్టు కంపెనీల్లో వినియోగించే నైలాన్‌ తాడు కట్టి ఉంది. ప్రాథమికంగా హతుడి ఆచూకీ కనిపెట్టడానికి సెంట్రల్‌ జోన్‌ పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. హర్యానాలోని పానిపట్‌ ప్రాంతం నుంచి వలసవచ్చి హఫీజ్‌పేటలో నివసించిన రామ్‌కుమార్‌ మృతదేహంగా తేలింది. కేసు మాత్రం కొలిక్కి రాకపోవడంతో నిందితులు ఇప్పటి వరకు చిక్కలేదు. 
ఈ ఉదంతం జరిగి ఆదివారానికి: 7 ఏళ్ల 5 నెలల 21 రోజులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement