దర్శనభాగ్యం కలిగేనా!
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనారసింహుడి ప్రధానాలయంలో స్వామి అమ్మవార్ల నిజ దర్శనం భక్తులకు మరింత దూరం అవుతోంది. దసరా, బ్రహ్మోత్సవాలు, స్వామి వారి జయంత్యుత్సవాలు ఇలా గడవు పొడిగిస్తూ పోతున్నారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తున్నా.. ఆశించినంత వేగంగా జరగడం లేదు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి యాదాద్రీశుడి దర్శనభాగ్యం కల్పిస్తామని వైటీడీఏ ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చడం లేదు. ముఖ్యమంత్రి యాదాద్రిని తిరుపతి తిరుమల తరహాలో ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి రూ. 1000 కోట్లతో బృహత్తర ప్రణాళికను రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైటీడీఏ పనులను పర్యవేక్షిస్తోంది.
బిల్లులు రాకపోవడమే కారణమా..?
యాదాద్రి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. 4 నెలలుగా వైటీడీఏ నుంచి బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. కూలీల కొరత, పెద్దనోట్ల రద్దు, వర్షాలు ఇలా పలు రకాల కారణాలతో పనులను వాయిదా వేస్తూ వస్తున్నారు.
జాప్యానికి కారణాలు
తొలుత దసరా, ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు ఇప్పుడు స్వామివారి జయంతి.. అంటే వచ్చే సంవత్సరం మే నాటికి పొడిగింపు జరిగింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ పనులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. దక్షిణ ప్రాకారం పనులు పూర్తికాకపోవడంతో శిల్పి పనులు, ప్రధానాలయం విస్తరణ పనులకు అడ్డంకిగా మారింది. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవల యాదాద్రికి వచ్చి బ్రహ్మోత్సవాలకు స్వయంభూవుల దర్శనం కల్పించలేమని జయంత్యుత్సవాల నాటికి అది సాధ్యమవుతుందని తెలిపారు. శనివారం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి యాదాద్రికి వచ్చి పనులను పరిశీలించి పనులు జరుగుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ పనుల ప్రణాళిక
అక్టోబర్ 19, 2016 ముఖ్యమంత్రి కేసీఆర్ గుట్టలో సమీక్ష నిర్వహించారు
మార్చి 31,2017 నాటికి సివిల్ పనులు పూర్తి చేయాలి
ఆగస్టు 31,2017 నాటికి శిల్పి పనులు పూర్తి చేయాలి
దసరా నాటికి స్వయం భూవుల దర్శనం కల్పించాలి