కొత్త ఫోర్స్..
● శిక్షణ పూర్తయిన కానిస్టేబుళ్ల రాక ● ఈ నెల 30న జిల్లాలో చేరిక ● పోస్టింగ్ ప్రక్రియకు ఎస్పీ కసరత్తు
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాకు కొత్త కానిస్టేబుళ్లు వస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని పలు పోలీసు శిక్షణ కేంద్రాల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి దీక్షాంత్ పరేడ్ నిర్వహించిన విషయం విదితమే. పాసింగ్ అవుట్‌పరేడ్ ద్వారా బయటకు వచ్చిన వారు ఇక క్షేత్రస్థాయిలో విధుల్లో చేరనున్నారు. ఈనెల 30న కొత్త కానిస్టేబుళ్లు జిల్లాలో రిపోర్టు చేయాల్సి ఉంది. తద్వారా ఎంత మంది చేరుతారనేది అదే రోజు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
ఖాళీలు భర్తీ అయ్యేనా..
జిల్లాలో సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల పోస్టులు 300 వరకు ఖాళీలు ఉన్నట్లు పోలీసు శాఖ తెలుపుతుంది. ఈనెల 30న కొత్త ఫోర్స్ రానుండగా, వారి ద్వారా ఈ ఖాళీలన్ని భర్తీ అవుతాయా.. లేదా అనేది చూడాల్సిందే. జిల్లా నుంచి 219 మంది కానిస్టేబుల్ శిక్షణ పొందారు. జడ్చర్ల, యూసుఫ్‌గూడలో పురుషులు, హైదరాబాద్‌లోని పోలీసు శిక్షణ కేంద్రంలో మహిళా కానిస్టేబుళ్లు జిల్లాకు చెందినవారు శిక్షణ పొందారు. ఇందులో సివిల్ కానిస్టేబుళ్ల పరంగా 94 మంది పురుషులు, 46 మంది మహిళలు, ఏఆర్ పరంగా 63 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నారు. వీరంతా జిల్లాలోనే రిపోర్టు చేస్తారా.. ఎవరైనా వేరేచోట పోస్టింగ్ తీసుకుంటారా అనేది చూడాల్సిందే. తద్వారా ఆ రోజు రిపోర్టు చేసిన వారి సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
కొత్త పీఎస్‌లు ఏర్పాటయ్యేనా..
తాజాగా ప్రభుత్వం జిల్లాలో మూడు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భోరజ్, సొనాల, సాత్నాల మండలాలు ఏర్పాటయ్యాయి. ఆయా మండలాల్లో కొత్త ఠాణాలను కూడా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దానికి అనుగుణంగా ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లను నియమించాల్సి ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణలో కానిస్టేబుళ్ల బాధ్యత కీలకం. ఖాళీల కారణంగా ప్రస్తుతం డ్యూటీ నిర్వహించే వారిపై అదనపు భారం పడుతుంది. ఈ నేపథ్యంలో కొత్త కానిస్టేబుళ్ల రాకతో కొంత ఊరట లభించే అవకాశం ఉంది.
ఆ రోజే తెలుస్తుంది..
జిల్లాలో శనివారం కొత్త కానిస్టేబుళ్లు రిపోర్టు చేయనున్నారు. తద్వారా ఆ రోజే ఎంత మంది ఇక్కడ చేరుతారనేది సంఖ్య తెలుస్తుంది. వారికి పోస్టింగ్ కల్పిస్తాం.
– గౌస్ ఆలం, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment