ఆదిలాబాద్: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. బస్టాండ్‌లోని ఆయా దుకాణాల నిర్వాహకులు నాసిరకం ఆహార పదార్థాలను విక్రయిస్తూ ప్రయాణికుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. అలాగే ఎమ్మార్పీకి మించి విక్రయిస్తున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అధిక ధరకు విక్రయాలు..
జిల్లాలోని ఆదిలాబాద్, ఉట్నూర్ డిపో పరిధిలో ని నాలుగు బస్టాండ్‌లు ఉన్నాయి. ఆయా ప్రాంగణాల్లో మొత్తం 33 వరకు దుకాణాలు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇక్కడ దుకాణాలు నిర్వహించే వారు ఎమ్మార్పీకే వస్తువులను విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు విరుద్ధంగా పలువురు అధిక ధరకు విక్రయిస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నారు. చాక్లెట్ మొదలుకొని బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ ఇలా ఏది తీసుకున్నా ఎమ్మార్పీకి మించి రూ.5 నుంచి 10 వరకు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ విషయానికి వస్తే నాసిరకమైనవి అంటగడుతున్నారు. డ్రింక్స్‌పై కూలింగ్ చార్జి పేరిట రూ.5 అదనంగా తీసుకుంటూ ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు.
‘మామూలు’గా వ్యవహరిస్తున్న అధికారులు..
ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందే క్రమంలో అధికారులు అప్పటికప్పుడు నామమాత్ర చర్యలతోనే సరిపెడుతున్నారనే విమర్శలున్నా యి. నిబంధనల ప్రకారం.. ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే వారిపై మూడంచెల్లో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటిని స్వీకరించి మొదటగా రూ.500 జరిమానా విధించి సరిపెడతారు. అయినా తీరు మార్చుకోకపోతే రెండోసారి రూ. వెయ్యి జరిమానా విధిస్తారు. మూడోసారి సైతం కేసు నమోదు అయితే షోకాజ్ అందించి షాప్ టెండర్ లైసెన్స్ రద్దు చేస్తారు. అయితే రద్దు విషయాన్ని పక్కన పెడితే, తనిఖీలు నిర్వహించేందుకు సైతం అధికారులు వెనకాడుతుండడంపై ప్రయణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు
బస్టాండ్లలో ఉండే స్టాళ్లలో ఎమ్మార్పీకే వస్తువులను అమ్మాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ సమయంలోనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంటాము. దుకాణాల ఎదుట ధరల పట్టికలను సైతం ఏర్పాటు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే చర్యలు తీసుకుంటాం. – సోలోమన్, ఆర్టీసీ ఆర్‌ఎం
Comments
Please login to add a commentAdd a comment