ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్లకోసారి నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే(న్యాస్)పరీక్ష నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష ద్వారా విద్యార్థు ల ప్రతిభ తేలనుంది. ఇందులో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల బోధన సామర్థ్యం తేటతెల్లమవుతుంది. ఇదివరకు నిర్వహించిన పరీక్షలో ఆదిలాబా ద్ లోపర్ఫామెన్స్ జిల్లాగా నమోదైంది. ఆ తర్వాత ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి జిల్లాను కొంత గట్టెక్కించారు. 2021లో నిర్వహించిన పరీక్షల్లో 34 శాతం విద్యార్థుల సామర్థ్యాలు మెరుగ్గా ఉన్నట్లు తేలింది. అయితే 50 శాతం మందిలో కనీస సామర్థ్యాలు మెరుగుపడని పరిస్థితి. సర్కారు బడుల్లో చదువుతున్న వారికి చదవడం, రాయడం, చతుర్వి ద ప్రక్రియలు చేయలేకపోతున్నట్లు స్పష్టమవుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 4న దేశ వ్యాప్తంగా న్యాస్ పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించగా జిల్లాలోని 98 పాఠశాలల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈసారి గట్టెక్కేనా..
సర్కారు పాఠశాలల్లోని 3,6,9 తరగతుల విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాలో 98 పాఠశాలలను గుర్తించారు. వీటిలో 34 పాఠశాలల్లో 3వ తరగతి విద్యార్థులకు, 29 పాఠశాలల్లో 6వ తరగతి విద్యార్థులకు, 35 పాఠశాలల్లో 9వ తరగతి విద్యార్థులకు ఓఎంఆర్ షీట్‌లో పరీక్ష నిర్వహిస్తారు. అయితే గతం కంటే ఈసారి మెరుగైన ఫలి తాలు సాధిస్తారా.. లేక మరోసారి లోపర్ఫామెన్స్ జిల్లాగా నమోదవుతుందా అనే ఉత్కంఠ అందరిలో ఉంది. ఈ పరీక్షను ఈసారి కేంద్రీయ విద్యాలయం వారు నిర్వహిస్తున్నారు. పరీక్ష ఇన్విజిలెటర్లుగా (ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా) డైట్, బీఎడ్ కళాశాల ఛాత్రోపాధ్యాయులు వ్యవహరించనున్నారు. 145 మంది ని ఇందుకోసం నియమించారు. కాగా బుధవారం పరీక్ష నిర్వహణకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పరీక్ష ఏవిధంగా నిర్వహించాలనే అంశాల గురించి తెలియజేశారు.
మూడు నెలల నుంచే సన్నద్ధం..
న్యాస్ పరీక్ష కోసం విద్యాశాఖ మూడు నెలల నుంచి సన్నద్ధమవుతోంది. విద్యార్థులకు మాక్‌టెస్టులు నిర్వహించి వారి సామర్థ్యాలను గుర్తిస్తున్నారు. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతున్నారు. 2017లో నిర్వహించిన న్యాస్ పరీక్షలో లోపర్ఫామెన్స్ జిల్లాగా నమోదు కావడంతో కేంద్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఆ తర్వాత 2021లో నిర్వహించగా కేవలం 34 శాతం విద్యార్థుల సామర్థ్యాలు మెరుగ్గా ఉన్నట్లు తేలింది. గతంతో పోల్చితే కొంత మెరుగు పడడంతో విద్యాశాఖ అధికారులతో పాటు ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.
జిల్లాలో..
మొత్తం పాఠశాలలు:1,439
ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు:739
విద్యార్థుల సంఖ్య:1,35,323
న్యాస్ ఫలితాలు
2017లో: లోపర్ఫామెన్స్ జిల్లా (ఎల్‌పీడీ)
2021లో : 34 శాతం
మెరుగైన ఫలితాలు సాధిస్తాం
జాతీయ స్థాయిలో నిర్వహించే న్యాస్ పరీక్షలో ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తాం. మూడు నెలల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. మాక్‌టెస్టులు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకుంటున్నాం. చదువులో వెనుకనబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. 98 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ పరీక్ష ఉంటుంది.
– ప్రణీత, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment