కాడి భారమై.. పాడెకు చేరువై.. | - | Sakshi
Sakshi News home page

కాడి భారమై.. పాడెకు చేరువై..

Published Fri, Nov 29 2024 1:58 AM | Last Updated on Fri, Nov 29 2024 1:58 AM

-

● తొమ్మిదేళ్లలో 360 మంది ఆత్మహత్య ● సాగులో నష్టంతోనే బలవన్మరణాలు

బోథ్‌: పెట్టుబడి పెరిగి, దిగుబడి తగ్గి, వచ్చిన కాస్త పంటకు ఆశించిన ధర రాక రైతులు నష్టపోతున్నా రు. అప్పు తీర్చే మార్గంలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. 2014 నుంచి 2023 వరకు జిల్లాలో 360 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారి క లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. సగటున ఏడాదికి 36 మంది ఆత్మహత్యకు పాల్పడుతుండగా ఇందులో అత్యధికులు కౌలు రైతులుండటం గమనార్హం.

అధిక వర్షాల కారణంగానే..

అధిక వర్షాలతో దిగుబడులు తగ్గడం, మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి దిగుబడి రెండేళ్లలో చాలా తగ్గింది. వచ్చిన పంటకు మద్దతు ధర అందడంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పత్తి అమ్ముకుంటున్నారు. చివర్లో ధరలు అమాంతం పెరుగుతున్నా లాభం లేకుండా పోతోంది. అధిక వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2020 నుంచి ఫసల్‌ బీమా అమలు చేయకపోవడంతో నష్టపోయిన పంటలకు బీమా వర్తించడం లేదు. పంట రుణాలివ్వాల్సిన బ్యాంకులు కొర్రీలు పెడుతున్నాయి. ఈ విషయాలన్నీ రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.

‘కౌలు’పై పట్టింపు కరువు

భార్య పేరిట ఉన్న భూమిలో వ్యవసాయం చేస్తున్న భర్త పేరిట భూమి లేకపోవడంతో అతడు చనిపోయినప్పుడు బాధిత కుటుంబానికి రైతుబీమా వర్తించడం లేదు. పట్టా ఉన్న రైతు మృతి చెందితే ఆ కుటుంబానికి బీమా అందుతున్నా పెద్ద దిక్కును కోల్పోతున్నామని బాధిత కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. ఇక కౌలు రైతులకు రైతుబీమా అమలు కావడంలేదు.

ఆత్మహత్యలు నివారించాలి

రైతుబంధు, రైతుబీమా అందక కౌలు రైతులు నష్టపోతున్నారు. ఆత్మహత్య చేసుకున్నవారిలో ఎక్కువగా వారే ఉన్నారు. భార్య పేరిట భూమి ఉండి.. భర్త చనిపోతే పరిహారం అందడం లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. పెట్టుబడి సాయం పెంచాలి. బ్యాంక్‌ రుణపరిమితి పెంచాలి. – సంగెపు బొర్రన్న,

రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు

జిల్లాలో రైతుల ఆత్మహత్యల వివరాలు..

(క్రైం రికార్డ్‌ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం)

సంవత్సరం ఆత్మహత్యలు

2014 31

2015 43

2016 46

2017 44

2018 45

2019 27

2020 26

2021 40

2022 44

2023 14

మొత్తం 360

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement