● రెండో రోజూ కొనసాగిన ఆందోళనలు ● అనర్హుల ఎంపికపై ఆగ్రహం
తాంసి: మండలంలోని వడ్డాడిలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సంక్షేమ పథకాలకు అర్హులైనా తమ పేర్లు మాత్రం జాబితాలో లేవంటూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటివి అనర్హులకేనా.. అర్హులకు ఇవ్వరా.. అంటూ అధికారులను నిలదీశారు. సమాచారం అందుకున్న మండల ప్రత్యేకాధికారి వెంకటరమణ అక్కడికి చేరుకున్నారు. జాబితాలో పేర్లు రాని అర్హులు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అనంతరం గ్రామసభ నిర్వహించి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న గ్రామస్తులు
● బేల మండలం డొప్టాలలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో భూమి ఉన్నవారికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాలో పేర్లు వచ్చాయని పలువురు కలెక్టర్ ముందే పేర్కొన్నారు. ముగ్గురి పేర్లు చెప్పడంతో వారిని జాబితా నుంచి తొలగిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
● బోథ్‌లో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న అధికారులు రేషన్‌కార్డు లబ్ధిదారుల జాబితా నుంచి 13 మందిని అనర్హులుగా గుర్తించినట్లుగా పేర్కొన్నారు. వారిలో పలువురు ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న రిటైర్డు ఉద్యోగులు, ఐటీ చెల్లించే వారు ఉండటం గమనార్హం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా నుంచి కూడా కొంతమందిని తొలగించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. పక్కా భవనాలు ఉన్నవారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని అభ్యంతరాలు రావడంతో తొలగించారు. తాంసి మండలం గొట్కూరిలో కూడా రేషన్‌కార్డుల జాబితా నుంచి ఇద్దరి పేర్లను తొలగించారు. కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ఉండగా తల్లి రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. దీనిపై అభ్యంతరం రావడంతో తొలగించారు. ఇలా పలుచోట్ల జాబితాలో వచ్చిన అనర్హులను తొలగించారు.
కొనసాగిన ఆందోళనలు..
గ్రామసభల్లో రెండో రోజు కూడా ఆందోళనలు కొనసాగాయి. తాంసి మండలం వడ్డాడి గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
● ఇంద్రవెల్లిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం నెలకొంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్‌కార్డు ఇవ్వలేకపోయారని కాంగ్రెస్ నాయకుడు పేర్కొనడంతో బీఆర్‌ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వల్పంగా వివాదం చోటు చేసుకుంది.
● తలమడుగు మండలం రుయ్యాడిలో ప్రొటోకాల్ విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు అధికారులను నిలదీశారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలను ఫ్లెక్సీలపై ఉంచకపోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాగే పలు గ్రామసభల్లో స్వల్ప ఆందోళనలు, ప్రజల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు వ్యక్తమయ్యాయి.
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నుంచి ప్రతిష్టాత్మకంగా నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపికలో భాగంగా గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రెండో రోజు బుధవారం రోజు కూడా ఈ సభలు కొనసాగాయి. కలెక్టర్ రాజర్షి షా బేల మండలం డొప్టాల, భవనీగూడా, జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌లో గల సరస్వతినగర్ సభల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే గ్రామసభల్లో లబ్ధిదారుల జాబితాలో అనర్హుల పేర్లు వచ్చాయని పలువురి నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్వయంగా కలెక్టర్ పాల్గొన్న సభలోనే ఇలాంటివి ఆయన దృష్టికి రావడం గమనార్హం. దీంతో వెంటనే అలాంటి వారి పేర్లను తొలగిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. కాగా జిల్లాలో మొత్తం 473 గ్రామసభలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటి వరకు 239 సభలను పూర్తి చేశారు. వార్డు సభల పరంగా 30 పూర్తయ్యాయి.
సర్వే ప్రామాణికతపై అనుమానాలు..
సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అధికారులు, సిబ్బంది మొదట సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నెల 16 నుంచి 20వరకు జిల్లాలోని గ్రామాలు, పట్టణంలోని వార్డుల పరిధిలో ఈ పరిశీలన చేపట్టారు. అయితే గ్రామసభల్లో ఆ జాబితాలోని అర్హులపేర్లపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి. దీంతో సర్వే ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లి ఈ పరిశీలన చేశారా.. లేని పక్షంలో తూతూ మంత్రంగా కానిచ్చారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు అన్ని విధాలా సంక్షేమ పథకాలకు అర్హులమైనప్పటికీ తమ పేర్లు జాబితాలో లేవని గ్రామసభల్లో పలువురు వాపోతున్నారు. మరో పక్కా అనర్హుల పేర్లు వెలుగులోకి వస్తుండటంతో విస్మయం కలిగిస్తోంది.
భారీగా దరఖాస్తులు..
బేల మండలం డొప్టాలలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ రాజర్షి షా లబ్ధిదారుల ఎంపిక విషయంలో కొన్ని విషయాలను స్పష్టం చేశారు. రైతు భరోసా మినహాయిస్తే.. మిగతా మూడు పథకాలు కొత్త రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు ఈ జాబితాలు ఫైనల్ కాదని పేర్కొన్నారు. గ్రామ సభల్లో వచ్చే దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. డొప్టాలాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాలో నుంచి ముగ్గురు అనర్హుల పేర్లు తొలగిస్తున్నట్లు.. అలాగే కొత్తగా ఏడుగురు పేర్లు జత చేస్తున్నట్లు కలెక్టర్ ెపేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామసభలో వచ్చే దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు ఈ సభ ద్వారా స్పష్టమైంది. రెండు రోజుల్లో నాలుగు పథకాలకు సంబంధించి మొత్తం 23,944 దరఖాస్తులు అందాయి.
గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు..
ఇందిరమ్మ ఇళ్లకోసం : 5,359
రేషన్‌కార్డుల కోసం : 14,019
ఆత్మీయ భరోసా కోసం : 4528
రైతు భరోసా కోసం : 38
Comments
Please login to add a commentAdd a comment