కార్మికుల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం
● ఆర్టీసీ సీఎంవో శైలజమూర్తి ● గ్రాండ్ హెల్త్ చాలెంజ్ ప్రారంభం
మంచిర్యాలఅర్బన్: ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీ కార్మికుల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆర్టీసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్(తార్నాక ఆస్పత్రి సీఎంవో) శైలజమూర్తి తెలిపారు. మంచిర్యాలలో రెండ్రోజులపాటు నిర్వహించనున్న గ్రాండ్ హెల్త్ చాలెంజ్ కార్యక్రమాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. కార్మికులు, కుటుంబ సభ్యులతో ఆరోగ్య పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. జాగ్రత్తలు, అవగాహన, వైద్య చికిత్సతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని అన్నారు. సంస్థ కార్మికులు, కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు, చికిత్స అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు.
ఆర్టీసీ ఆస్పత్రి తనిఖీ
కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులకు వైద్యం అందించే మంచిర్యాల ఆర్టీసీ ఆస్పత్రిని సీఎంవో శైలజమూర్తి బుధవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి మందులపై ఆరా తీశారు. చికిత్స పొందే కార్మికులు, కుటుంబసభ్యుల వివరాలు తెలుసుకున్నారు. డిపోలో గ్యారేజీ కార్మికులతో ముచ్చటించారు. ఆస్పత్రిని ఆధునీకరించి వైద్యసిబ్బంది అందుబాటులో ఉంచామని అన్నారు. కార్మికులు వివిధ ఆస్పత్రుల వైద్య పరీక్షల రిపోర్టులు సీఎంవో దృష్టికి తీసుకురాగా పరిశీలించారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సోలోమాన్, డిపో మేనేజర్ జనార్దన్, అసిస్టెంట్ డిపో మేనేజర్ దేవపాల, వైద్యులు రామలశౌరి, సరయు, హెల్త్‌వాలంటరీలు ఉమా, సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం కోసం వినతి
కార్మికులు అత్యవసర చికిత్స నిమిత్తం తార్నాక హైదరాబాద్‌కు వెళ్లకుండా ప్రతిమా ఆసుపత్రికి రెఫ ర్ చేసేలా చూడాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ బోర్డు సభ్యులు సత్తయ్య, మంగ సీఎంవోకు వినతిపత్రం అందజేశారు. తార్నకాకు రెఫర్ చేయడంవల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అత్యవసరమైన మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment