ప్రకృతి వైపరీత్యాల జిల్లాగా గుర్తింపు
సాక్షి,పాడేరు: ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో జిల్లా ప్రజలు, రైతాంగానికి ఏర్పడిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాను ప్రకృతి వైపరీత్యాల జిల్లాగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఏఎస్.దినేష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది పాటు మారిటోరియం ప్రకటించినందున ఈమేరకు రైతులంతా రుణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించారు. పేదల జీవన ప్రమాణాల మెరుగుకు బ్యాంకులు సహకరించాలని, పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి కొత్త రుణాలు అందించేందుకు ముందుకు రావాలన్నారు. విద్యా రుణాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బంగారంపై రుణాలు సక్రమంగా అందించలేని బ్యాంకులకు స్ట్రాంగ్ రూమ్‌లు నిర్మించాలని ఐటీడీఏ పీవోలను ఆదేశించారు. వరితో పాటు కాఫీ, ఇతర అంతరపంటలకు రెండు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. వీటితోపాటు పాడి పశువులు, పందుల పెంపకం, చేపలబోట్లకు రుణాలతోపాటు పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎం పథకాలకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్‌పతి దీది పథకం రుణాలను పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక్‌గౌడ్, ఎల్టీఎం మాతునాయుడు, యూబీఐ కన్వీనర్ హరిప్రసాద్, ఎస్‌బీఐ ఆర్‌ఎం అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీ
గిరి రైతులకు రుణాల రీషెడ్యూల్
కలెక్టర్ దినేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment