బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
● కూలి పనులు దొరక్క నిరాశ ● మృతుడు కాకినాడ జిల్లా వాసి
పాడేరు : పొట్టి కూటి కోసం వలస వచ్చిన ఓ వ్యక్తి కూలి పనులు దొరక్కపోవడంతో నిరాశకు గురయ్యాడు. జీవితంపై విరక్తితో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్ఐ సూర్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలోని పారుపాక గ్రామానికి చెందిన సారిపల్లి గంగరాజు (52) అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం కూలి పనుల నిమిత్తం పాడేరు వచ్చాడు. అప్పటినుంచి సక్రమంగా కూలిపనులు దొరక్కపోవడంతో నిరాశకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో కొత్త పాడేరు వద్ద వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం బావి వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లిన మహిళలు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు గంగరాజుగా పోలీసులు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment