గ్రామ వలంటీర్ల ఆందోళన
సాక్షి,పాడేరు: ఏపీ గ్రామ వలంటీర్లంతా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం పాడేరులో ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్‌ను ముట్టడించారు. అనంతరం ధర్నా చేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.సుందర్రావు మాట్లాడుతూ జిల్లాలోని గ్రామ వలంటీర్లందరికీ నెలకు రూ.10వేల వేతనంతో ఉద్యోగాల్లో వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించడమే కాకుండా బలవంతంగా రాజీనామాలు చేయించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.10వేలకు వేతనాలు పెంచుతామని హమీ ఇచ్చి, సీఎం కాగానే వలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేయడం అన్యాయమన్నారు. కూటమి ప్రభుత్వం వలంటీర్లకు ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రులంతా అబద్ధాలు చెబుతున్నారని వలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.ప్రసాదరావు, ఇతర నాయకులు కొండబాబు ఆందోళన వ్యక్తంచేశారు. వలంటీర్ల వ్యవస్థ లేకుండా 2024 మే నెల వరకు వలంటీర్లకు ఎలా జీతాలు చెల్లించారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో మంత్రి బాల వీరాంజనేయ వార్డు, గ్రామ వలంటీర్ల విషయంలో అసత్యాలు చెబుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనంగా ఉండడం దారుణమని వారు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వార్డు, గ్రామ వలంటీర్లను విధుల్లో కొనసాగించాలని లేనిపక్షంలో కలెక్టరేట్‌లు ముట్టడించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేత బి.సన్నిబాబు,వలంటీర్ల సంఘ ప్రతినిధులు జి.దేవా, చిన్నయ్య, శోభన్, సురేష్‌కుమార్, సత్యారావు, తాతబాబు, కృష్ణారావు, ఆనంద్, కొండమ్మ, భవాని తదితరులు పాల్గొన్నారు.
చింతూరు: గ్రామ, వార్డు వలంటీర్ల ఉపాధిని కాపాడి ఉద్యోగభద్రత కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో వలంటీర్లు శనివారం చింతూరులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఐటీడీఏ వద్ద ఆందోళన చేపట్టారు. ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌కు వినతిపత్రం అందజేశారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
పాడేరు, చింతూరులో ధర్నా
Comments
Please login to add a commentAdd a comment