అనారోగ్యంతో విద్యార్థిని మృతి
గురుకుల పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణం: మృతురాలి తండ్రి మోహనరావు కన్నీరుమున్నీరు
అరకులోయ రూరల్: అనారోగ్యంతో బాధపడుతున్న గురుకుల విద్యార్థిని మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని యండపల్లివలస గురుకుల బాలికల పాఠశాలలో జన్ని ప్రియాంక (8) 6వ తరగతి చదువుతోంది. ఈమె మూడు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గురువారం ఉదయం వచ్చి ఆమెను అరకులోయ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం తిరిగి పాఠశాలకు తీసుకువచ్చారు. స్వగ్రామం దుమగుడకు తీసుకువెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరినా ప్రిన్సిపాల్ కుదరదని సమాధానం ఇచ్చారని విద్యార్థిని తండ్రి మోహన్‌రావు తెలిపారు. దీంతో ఆమెను పాఠశాలలోనే వదిలి ఇంటికి వెళ్లిపోయామని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో సాయంత్రం ప్రియాంక ఆరోగ్యం విషమించడంతో పాఠశాల సిబ్బంది, నిర్వాహకులు అరకు ఏరియా ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తమ కుమార్తె ప్రియాంక మృతికి పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణమని తండ్రి మోహనరావు ఆరోపిస్తూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇలావుండగా మృతి చెందిన ప్రియంక కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని పద్మాపురం పంచాయతీ ఉప సర్పంచ్ జన్ని భగత్‌రాం డిమాండ్ చేశారు. విద్యార్థుల మరణాలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పరంగా కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment