ప్రకృతి వ్యవసాయ విధానంలో చిరుధాన్యాల సాగు చేపట్టిన గిరి
● చిరుధాన్యాల సాగులో రెట్టింపు
దిగుబడి సాధిస్తున్న గిరి రైతులు
● పంట కోత ప్రయోగాల్లో గుర్తించిన అధికారులు
● గణనీయంగా పెరుగుతున్న విస్తీర్ణం
● మరింత ప్రోత్సహించేందుకు
కార్యాచరణ
సాక్షి,పాడేరు: ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన చిరుధాన్యాల సాగు గిరిజన రైతులకు కలిసొచ్చింది. దీంతో సాగు విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 3,600 ఎకరాల్లో రాగులు, సామలు, కొర్రల సాగు చేపట్టారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో దిగుబడి ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం పంట కోత పనుల్లో గిరిజనుల నిమగ్నమయ్యారు. అధికారులు పంట కోత ప్రయోగాలు చేపట్టారు.
● సాధారణ పద్ధతిలో సాగు చేసిన సందర్భాల్లో రాగులు, సామలు ఎకరాకు కనీసం 500 కిలోలు కూడా వచ్చేవి కావు. ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేయడం వల్ల నాణ్యమైన, ఆరోగ్యమైన ఉత్పత్తులను సాధిస్తున్నారు.
● రాగులు ఎకరాకు 1200 కిలోలు, సామలు, కొర్రలు వెయ్యి కిలోలకు పైగా దిగుబడి వస్తున్నట్టు గిరిజన రైతులు తెలిపారు.
అధిక దిగుబడి ఇలా..
● డుంబ్రిగుడ మండలం కరకవలస గ్రామానికి చెందిన గొల్లోరి గోపాల్ అనే గిరిజన రైతు ఎకరా విస్తీర్ణంలో సామ పంట చేపట్టారు. పంట కోత ప్రయోగంలో 1085 కిలోలు దిగుబడి రావడం ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.
● హుకుంపేట మండలం తడిగిరి పంచాయతీలోని పొదిలి గ్రామంలో కాకర చంటిబాబు అనే యువ గిరిజన రైతు ఎకరాలో రాగుల సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించాడు.
● డుంబ్రిగుడ మండలం సొవ్వా ప్రాంతంలోని పనసవలస గ్రామానికి చెందిన పాంగి సొన్ను ఎకరాలో రాగుల సాగు చేపట్టగా 1220 కిలోలు దిగుబడి వచ్చింది.
ప్రకృతి విధానంతో మేలు
ప్రకృతి వ్యవసాయ విధానంలో రాగులను నాలుగేళ్లుగా సాగు చేస్తున్నా. ఈఏడాది కూడా పంట సాగు ఆశాజనకంగా ఉండడంతో ఇటీవల పంట కోతల ప్రయోగం చేపట్టారు.1200 కిలోల దిగుబడి వచ్చింది. గత ఏడాది కూడా అంతే దిగుబడి ఉంది. సాధారణ పద్ధతిలో సాగుచేస్తే పిలకలు అధికంగా ఉండేవి. 400 కిలోలకు మించి దిగుబడి వచ్చేది కాదు. – కాకర చంటిబాబు,
గిరిజన రైతు, పొదిలి, హుకుంపేట మండలం
గిరి రైతులను పోత్సహిస్తున్నాం
గత ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్నిప్రోత్సహిస్తున్నాం. ఆవుపేడ, మూత్రాన్ని వినియోగించిన రైతులు మంచి దిగుబడి సాధించారు. దీనిని గమనించిన మిగతా రైతులు ఈ విధానంపై ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల ఏడాది ఏడాదికి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. పంట కోత ప్రయోగాల్లో అధిక దిగుబడులు నమోదయ్యాయి. వచ్చే ఖరీఫ్‌లో 6వేల ఎకరాల్లో సాగు చేపడతాం. – భాస్కరరావు, డీపీఎం,
ప్రకృతి వ్యవసాయ విభాగం, పాడేరు
Comments
Please login to add a commentAdd a comment