భూరికార్డుల తారుమారుపై విచారణ జరపండి
అనంతగిరి (అరకులోయ రూరల్): మండలంలో రొంపల్లి పంచాయతీలో భూరగ, చిన్నకోనేల ఆదివాసీ గిరిజనుల వ్యవసాయ భూములు అన్యాక్రాంతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని బాధిత గిరిజన రైతులు డిమాండ్ చేశారు. గురువారం వారు భూరగలో అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ వార్డు సభ్యుడు సోమిల అప్పలరాజు మాట్లాడుతూ గిరిజనులను మభ్యపెట్టి వ్యవసాయ భూముల రికార్డులు తారుమారు చేసి కబ్జాకు పాల్పడ్డారన్నారు. గిరిజన రైతులు 70 కుటుబాలు 105 ఎకరాలు జిరాయితీ భూమిలో తాత ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నారన్నారు. 2017లో రెవెన్యూ అధికారులు మైదాన ప్రాంతాలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మకై భూరికార్డులు మార్చుశారని ఆరోపించారు. గతంలో పలుమార్లు కలెక్టర్, ఐటీడీఏ పీవోలకు ఫిర్యాదు చేసినా నేటికీ భూసమస్య పరిష్కారం కాలేదన్నారు. వాస్తవాలు తేల్చేందుకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కలెక్టర్‌తో కూడిన కమిటీని నియమించి గ్రామంలో విచారణ జరిపించాలన్నారు. లేకుంటే దశలవారీగా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. దీనిలో భాగంగా వచ్చేనెల 13న పాడేరులో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 24 గంటల రిలే నిరహరదీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధిత గిరిజనులు పెంటయ్య, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
బాధిత గిరిజనుల డిమాండ్
అర్ధనగ్నంగా నిరసన
Comments
Please login to add a commentAdd a comment