ఈదురు గాలులతో భారీ వర్షం
యలమంచిలి రూరల్: పట్టణంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సుమారు గంటన్నరసేపు భారీ వర్షం కురిసింది.ఒక్కసారిగా ఆకాశంలో దట్టమైన మేఘాలు అలముకుని ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు వీధుల్లో చెట్లు,విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి.దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.గ్రీన్‌సిటీ, హైవే పక్కన,ప్రేమ సమాజం,రాంనగర్, యానాద్రి కాలనీ,అల్లూరి సీతారమరాజు కాలనీ,ఎర్రవరం,విద్యుత్ ఉపకేంద్రం వద్ద,కోర్టుపేట,రైల్వేస్టేషన్ రోడ్డు, నాగేంద్ర కాలనీ,ఓరుగంటివారి వీధి తదితర ప్రాంతాల్లో రహదారులపై సుమారు 40 వరకు చెట్లు,చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. 10 విద్యుత్ స్తంభాలు కూలాయి. రహదారులపై విరిగి పడిన చెట్లు,కొమ్మల్ని జేసీబీలు,కోత యంత్రాలతో తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు, ఇంజినీర్లు,పట్టణ ప్రణాళికా విభాగం సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. విరిగిన,ఒరిగిన విద్యుత్ స్తంభాలను సరిచేసి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి ఆ శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.రాత్రి 8 గంటల సమయానికి పట్టణంలో కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పట్టణమంతా అంధకారం అలముకుంది.బలమైన ఈదురు గాలుల ధాటికి అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత, ఉక్కబోతతో అల్లాడిన జనం భారీ వర్షంతో ఉపశమనం పొందారు.వరి పంటకు ఈ వర్షం మేలు చేస్తుందని రైతులు తెలిపారు.
యలమంచిలి పట్టణంలో కూలిన 40 చెట్లు, 10 విద్యుత్ స్తంభాలు
నిలిచిన విద్యుత్ సరఫరా
Comments
Please login to add a commentAdd a comment