కొత్త మద్యం పాలసీతో నేరాంధ్ర ఖాయం
● ప్రజారోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ● ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా
అనకాపల్లి : కూటమి ప్రభుత్వం అక్టోబర్ నుంచి అమలు చేస్తున్న కొత్త మద్యం పాలసీ ద్వారా రాష్ట్రంలో నేరాలు విపరీతంగా పెరడంతో పాటు, లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని, రాష్ట్రంలో తక్షణమే మద్యాన్ని నిషేధించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జిల్లా అధ్యక్షురాలు వి.మాణిక్యం అన్నారు. స్థానిక నెహ్రూచౌక్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐద్యా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ లైసెన్స్ విధానాల్లో ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులను ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని, మద్యం విక్రయాలతో లైసెన్సు ఫీజుల ద్వారా రూ.200 కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. మద్యం నియంత్రించి, నేరాలను అరికట్టాలని, మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను నిర్మూలించడానికిప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఆదాయాన్ని పొందడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమా ? అని ప్రశ్నించారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డి.డి.వరలక్ష్మి, సభ్యులు లక్ష్మి,నారాయణమ్మ, తులసి, నూకరత్నం, సుగుణ, కె.వరలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment