వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం
● దాడిలో గుమస్తాపై కత్తి వేటు ● ఏరియా ఆస్పత్రికి తరలింపు.. కేసు నమోదు ● దాడి చేసింది తెలుగుదేశం కార్యకర్త ● కేసు పెట్టవద్దని బాధితుడి భార్యకు టీడీపీ నేతల బెదిరింపులు
నర్సీపట్నం: రాష్ట్ర అయ్యరక కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, వైఎస్సార్‌సీపీ నాయకుడు కర్రి శ్రీనివాసరావు, ఆయన గుమస్తా రాజులపై హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో శ్రీనివాసరావు స్వల్పగాయాలతో బయటపడగా.. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన గుమస్తా రాజు తలకు బలమైన గాయమైంది. శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీలో చురుగ్గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె వినీల చైతన్య మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్నారు. దాడి జరిపింది టీడీపీ క్రియాశీల కార్యకర్త కావడంతో రాజకీయంగా కలకలం రేగింది. కేసు పెట్టవద్దని గుమస్తా రాజు భార్యను టీడీపీ నేతలు బెదిరించడం గమనార్హం. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో శ్రీనివాసరావు కథనం ప్రకారం.. పూజకు అవసరమైన మర్రి ఆకులను తెచ్చేందుకు బైక్‌పై గుమస్తా రాజుతో కలిసి గురువారం ఉదయం శ్రీనివాసరావు బైక్‌పై వెళుతుండగా టీడీపీ క్రియాశీల కార్యకర్త అయిన రౌడీషీటర్ పప్పలనాయుడు, నవీన్ వారిని వెంబడించారు. శారదనగర్ సుబ్రహ్మణేశ్వరస్వామి ఆలయం వద్ద కత్తితో శ్రీనివాసరావుపై దాడి చేశారు. గుమస్తా రాజు అడ్డుకోవడంతో శ్రీనివాసరావు స్వల్ప గాయంతో బయటపడ్డారు. అయితే రాజు తలకు బలమైన గాయమైంది. జనం గుమిగూడేసరికి దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై పరారయ్యారు. గాయపడిన గుమస్తాను ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. వైఎస్సార్‌సీపీలో తాను చురుకై న పాత్ర పోషించడాన్ని జీర్ణించుకోలేక టీడీపీ నాయకులు రౌడీషీటర్‌తో తనను హత్య చేయించేందుకు కుట్ర చేశారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. గుమస్తా అడ్డుకోకపోతే తనను చంపేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వ్యక్తులకు తనకు ఎలాంటి శతృత్వం లేదని ఆయన పేర్కొన్నారు. తన ఓనర్ శ్రీనివాసరావును నరికేందుకు కత్తితో దాడి చేస్తుండగా తాను అడ్డుకోవడంతో తలపై వేటు పడిందని పరామర్శించడానికి ఆస్పత్రికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌కు గుమస్తా రాజు వివరించారు. ఎమ్మెల్యేతో పాటు పార్టీ నాయకులు చింతకాయల వరుణ్, ఏకా శివ, తమరాన శ్రీను, మామిడి శ్రీను, పెట్ల అప్పలనాయుడు బాధితులను పరామర్శించారు.
బాధితుడి భార్యకు బెదిరింపులు
పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని టీడీపీ నాయకులు తనను భయపెట్టారని నర్సీపట్నం ఎస్సీ కాలనీకి చెందిన బాధితుడు రాజు భార్య దుద్దపూడి కనక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రౌడీషీటర్ పప్పలనాయుడు, నవీన్ అనే వ్యక్తులు ఉదయం 7 గంటల సమయంలో సుబ్రహ్మణేశ్వరస్వామి ఆలయం వద్ద తన భర్తపై కత్తితో దాడి చేశారని తెలిపారు. పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లగా టీడీపీ నాయకులు ధనమిరెడ్డి మధు, బండారు కొండబాబు తన వద్దకు వచ్చి ‘మీకు మాకు ఇంతవరకు గొడవలు లేవు. ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తే పరిస్థితి వేరేగా ఉంటుందని, మీరు జాగ్రత్తగా ఉంటే మంచిదని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని భయపెట్టార’ని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి నుంచి తన భర్తకు, తనకు ప్రాణహాని ఉన్నందున వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఆమె ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.
కేసు నమోదు
బాధితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి చేసిన పప్పలనాయుడు, నవీన్‌లపై కేసు నమోదు చేశామని టౌన్ సీఐ జి.గోవిందరావు తెలిపారు. ఫిర్యాదుపై విచారణ జరుపుతామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment