ఇంటి వద్దనే ఈ–కేవైసీ
● గ్యాస్ డెలివరీ బాయ్ ద్వారా చేసే ఏర్పాటు ● అనుసంధానం చేసుకుంటేనే దీపం లబ్ధి: జేసీ
తుమ్మపాల: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం–2 పథకం లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి చెప్పారు. తెలుపు రేషన్ కార్డు కలిగిన గ్యాస్ వినియోగదారులందరూ ఈ పథకానికి అర్హులేనని, అయితే ఈ–కేవైసీ అనుసంధానం జరిగితేనే లబ్ధి పొందగలరని చెప్పారు. ఈ–కేవైసీ చేయించని వారు ఆందోళన చెందవద్దని, గ్యాస్ డెలివరీ బాయ్ ద్వారా వినియోగదారుని ఇంటి వద్దనే ఈ–కేవైసీ చేయించుకునేలా చర్యలు చేపట్టామన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీపం–2 పథకంపై అవగాహన కోసం ఆమె పలు అంశాల గురించి వివరించారు. జిల్లాలో దీపం, ఉజ్వల–1, ఉజ్వల–2, సీఎస్సార్ (సీ్త్ర), తెలుపు రేషన్ కార్డు కలిగిన సాధారణ గ్యాస్ వినియోగదారులు 5,17,081 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశామన్నారు. వారిలో ఈ–కేవైసీ పూర్తయిన 3,60,000 మందిని దీపం–2 పథకానికి అర్హులుగా గుర్తించామన్నారు. ఈ–కేవైసీ ద్వారా గ్యాస్ కనెక్షన్‌కు అనుసంధానమైన వారికి మాత్రమే నగదు రిఫండ్ జరుగుతుందని చెప్పారు. డెలివరీ బాయ్ గ్యాస్ సిలిండర్‌తో ఇంటికి వచ్చినప్పుడు ఈ–కేవైసీ (ఫేస్ రికగ్నిషన్) చేసుకోవచ్చన్నారు. జిల్లాలో దీపం–2 పథకం అమలు చురుగ్గా జరుగుతోందని, ఈనెల 6వ తేదీ వరకు బుక్ చేసుకున్న 61,838 మందిలో 50 శాతం అనగా 31,168 మందికి ఉచితంగా సరఫరా చేయడం జరిగిందన్నారు. దీపం–2 పథకం అమల్లో ఇబ్బందులు, సూచనలు టోల్‌ఫ్రీ నెం.1967కు తెలపవచ్చని చెప్పారు. ఇబ్బందులుంటే సచివాలయం, పీజీఆర్‌ఎస్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. పౌరసరఫరా శాఖ 24 గంటల్లో ఇబ్బందిని పరిష్కరిస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment