సర్పంచ్‌లను వేధిస్తున్న డీపీవో
● వైఎస్సార్‌సీపీ పాయకరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంబాల జోగులు
ఎస్.రాయవరం: వైఎస్సార్ సీపీ మద్దతుదారు సర్పంచ్‌లను డీపీవో శిరీషారాణి వేధిస్తున్నారని, పంచాయతీ రికార్డులను అక్రమంగా తీసుకెళ్లి ఇబ్బందులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పాయకరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంబాల జోగులు అన్నారు.అడ్డురోడ్డు క్యాంప్ కార్యాలయం వద్ద శనివారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. వైఎస్సార్ సీసీ మద్దతుదారులైన సర్పంచ్‌లను కూటమి ప్రభుత్వ నాయకుల ఆదేశాలతో అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలకు కూటమి నాయకులు తెరలేపారని ఆరోపించారు. నర్సీపట్నం డివిజన్ పరిధిలో ఇప్పటికే 100కి పైగా పంచాయతీల్లో రికార్డులను డీపీవో శిరీషారాణి తీసుకువెళ్లారన్నారు. అక్రమంగా రికార్డులు తీసుకువెళ్లి సర్పంచ్‌లను ఇబ్బందులు పెట్టడం మంచి పద్ధతి కాదని విమర్శించారు. కొన్ని పంచాయతీల్లో కోర్టు స్టేలు విధించినా ఆర్డర్స్ ఇవ్వడంలేదన్నారు.ఈ సమస్యలపై ఇప్పటికే కలెక్టరుకు తెలియజేసినట్టు చెప్పారు.డీపీవో నిబంధనలు అతిక్రమిస్తున్నారని ఆరోపించారు.సర్పంచ్‌ల ప్రమేయం లేకుండా ఉపాధి హామీ పనులు చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. పంచాయతీలకు ప్రత్యేకత కల్పించి, సర్పంచ్‌లకు అన్ని హక్కులు ఉండేలా చేస్తామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు కాలేదన్నారు.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేసిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతు గాడి తప్పాయని, కూటమి అధికారం చేపట్టిన తరువాత ఐదు నెలల్లో రాష్ట్రంలో ఐదు నెలల్లో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. ఇకనైనా సర్పంచ్‌లపై వేధింపులు ఆపకుంటే వైఎస్సార్‌సీపీ నేతలతో గ్రామస్థాయిలోఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పన్న, వైఎస్సార్ సీపీ పాయకరావుపేట, నక్కపల్లి, కోటవురట్ల మండల అధ్యక్షులు చిక్కాల రామారావు, శీరం నరసింహమూర్తి,కిళ్లాడ శ్రీనివాసరావు,సర్పంచ్‌లు కోడ కోటేశ్వరరావు,సకినేటి వెంకటరమణ,చోడిపల్లి గోవిందు,వైఎస్సార్ సీపీ నాయకులు మధువర్మ,పొలుమూరి అప్పలరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment