బావిలో పడి మహిళ మృతి
దేవరాపల్లి: మండలంలోని కాశీపురం శివారు చిటిమిరెడ్డిపాలెంకు చెందిన చిటిమిరెడ్డి లక్ష్మి(57) బావిలో పడి మృతిచెందిన ఘటన శనివారం వెలుగు చూసింది. కాశీపురం సచివాలయానికి సమీపంలో తారురోడ్డుకు ఆనుకొని ఉన్న బావిలో చిటిమిరెడ్డి లక్ష్మి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సచివాలయ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. మృతురాలు లక్ష్మి భర్త సత్తిబాబు మూడేళ్ల క్రితం మరణించాడు. లక్ష్మికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరు తమ కుటుంబాలతో విశాఖపట్నంలో ఉంటున్నారు. చిటిమిరెడ్డిపాలెంలో ఒంటరిగా ఉంటున్న లక్ష్మి ఈ నెల 14వ తేదీ సాయంత్రం కార్తీక దీపాలు వెలిగించడానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు నూతిలో పడి మృతిచెంది ఉంటుందని హెడ్‌కానిస్టేబుల్ పైడిరాజు విలేకరులకు తెలిపారు. మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో రెండు రోజుల క్రితమే బావిలో పడి మృతి చెంది ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి, శవ పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టానికి ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు నానిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్‌కానిస్టేబుల్ పైడిరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment