వేంపాడులో భూ సర్వేను అడ్డుకున్న రైతులు
భూముల సర్వే చేపట్టవద్దని అధికారులతో రైతుల వాగ్వాదం
నక్కపల్లి: రైతులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, వారికి తెలియకుండా భూములు సర్వే చేయడం ఏమిటంటూ పలువురు రైతులు సర్వే అధికారులను నిలదీశారు. గురువారం వేంపాడు, నెల్లిపూడి గ్రామాల పరిధిలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే గోపాలరాజు ఆధ్వర్యంలో సర్వే బృందం భూముల సర్వే ప్రారంభించేందుకు రాగా రైతులు అడ్డుకున్నారు. ఇప్పటికే ఏపీఐఐసీ వారు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని, మళ్లీ భూముల జోలికి ఎందుకు వస్తున్నారంటూ నిలదీశారు. తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా భూముల్లోకి వచ్చి సర్వే ప్రారంభించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం గ్రామ సభలు నిర్వహించకుండా రైతులకు సంబంధించిన జిరాయితీ భూముల్లో సర్వే చేయడం సమంజసం కాదన్నారు. సర్వే ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేయమన్నారు.. తదితర వివరాలు తెలియజేయకుండా సర్వే చేయడానికి కుదరదని రైతులు అయినంపూడి రవిరాజు, పేరూరి బాబ్జీ తదితరులు అడ్డుకోవడంతో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామంటూ అధికారులు సర్వే నిలిపివేసి వెనక్కి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గోప్యంగా సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment