ఇసుకపై ప్రైవేటు
డిపోలన్నీ టీడీపీ నేతలకే అప్పగింత
అయినవారికే ఎన్‌వోసీలు...!
ఉచిత ఇసుక పేరుతో కూటమి ప్రభుత్వం
సొంత పార్టీ నేతల జేబులు నింపుతోంది.
ఇప్పటివరకు రీచ్‌లు లేని ప్రాంతాల్లో
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక
డిపోల స్థానంలో ప్రైవేటు ఇసుక డిపోల
ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ ప్రైవేటు ఇసుక
డిపోలను సొంత పార్టీకి చెందిన ప్రైవేటు
సంస్థలకు అప్పగించేసింది. పైకి టెండర్లని
చెప్పినా తెరవెనుక తమకు ఇష్టమైన
సంస్థలకే టెండర్లు దక్కేలా వ్యవహారాలు
నడిపారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు ఎకరాల స్థలం సొంతం/లీజుకు
ఉండటంతో పాటు రవాణా వాహనాలు
కలిగిన సంస్థలు టెండర్లు పాల్గొవచ్చంటూ నిబంధనలు రూపొందించారు. అయితే స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు స్థానిక రెవెన్యూ
అధికారులు నిరంభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీచేయాల్సి ఉంటుంది. అయితే రెవెన్యూ
అధికారుల ద్వారా ఇష్టమైన వారికి ఎన్‌వోసీలు ఇప్పించి టెండర్లు దక్కేలా చేశారన్న
విమర్శలు వినిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
విశాఖ జిల్లాలో భీమిలి, గాజువాక, ముడసర్లోవ ప్రాంతాల్లో ప్రైవేటు ఇసుక డిపోల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించారు. గాజువాక ఇసుక డిపో కాంట్రాక్టును నాగేంద్ర ఇన్ఫ్రాకు, ముడసర్లోవ ఇసుక డిపో బాధ్యతలను నన్నపనేని ఎర్త్ మూవర్స్, భీమిలి ఇసుక డిపో కాంట్రాక్టును మిషి ఇన్ఫ్రా కంపెనీలకు అప్పగిస్తూ ఈ నెల 23వ తేదీన జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఇందులో నాగేంద్ర ఇన్ఫ్రా సంస్థకు చెందిన వ్యక్తులు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక విధానంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)లో కేసు వేసిన వారిగా తెలుస్తోంది. మరోవైపు ఈ మూడు సంస్థలకు అధికార టీడీపీ ప్రభుత్వ పెద్దల అండదండలున్నట్లు సమాచారం. స్థానిక నేతలకు ఏ మాత్రం సంబంధం లేకుండా.. ముఖ్యనేతతో పాటు మైనింగ్‌శాఖ మంత్రి అండదండలతోనే ఈ సంస్థలకు టెండర్లు దక్కినట్టు తెలుస్తోంది. మరోవైపు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, నక్కపల్లి, అచ్యుతాపురంలో ప్రైవేటు ఇసుక డిపోలకు ఈ నెల 20వ తేదీన టెండర్లను ఆహ్వానించగా 29వ తేదీన ఫైనల్ చేయనున్నారు. ఇక్కడ కూడా అధికార పార్టీకి చెందిన సంస్థలకే టెండర్లు దక్కేలా వ్యవహారాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి విశాఖ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ఇసుక డిపోల ఏర్పాటు కోసం పలువురు ఆసక్తి చూపారు. 10 నుంచి 17 సంస్థల వరకు ఇసుక డిపోల ఏర్పాటు కోసం దరఖాస్తులను సమర్పించారు. అయితే, ఇసుక డిపో ఏర్పాటు కోసం 4 ఎకరాల స్థలాన్ని రైతుల నుంచి లీజు తీసుకునేందుకు ఆయా సంస్థలు సమర్పించిన పత్రాలకు స్థానిక తహసీల్దార్లు నిరంభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగానే పక్కాగా ఫలానా సంస్థలకే ఈ ప్రైవేటు ఇసుక డిపోలను ఇవ్వాలనే ఆదేశాలు ఉండటంతో వారికి మాత్రమే ఎన్‌వోసీలు జారీ చేసినట్టు విరమ్శలు గుప్పుమంటున్నాయి. ఈ మేరకు అమరావతి నుంచే మొత్తం ఆదేశాలు వచ్చినట్టు రెవెన్యూ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రధానంగా కీలకమైన మంత్రితో పాటు సదరు శాఖకు చెందిన మంత్రి నుంచి వచ్చిన ఆదేశాలే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సొంత స్థలం ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటే.. ఎన్‌వోసీ కోసం ఆయా రెవెన్యూ అధికారులు రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకూ వసూలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా ఎన్‌వోసీ తెచ్చుకున్న సంస్థలను సాంకేతిక కారణాలు చూపుతూ అనర్హత వేటు వేయగా... మరోవైపు టెండరు దక్కే అవకాశం ఉన్న ఓ సంస్థకు సొంతంగా 7 ఎకరాలు ఉన్నప్పటికీ 4 ఎకరాల స్థలం కూడా లేదంటూ ఎన్‌వోసీ ఇచ్చేందుకు స్థానిక రెవెన్యూ అధికారులు కొర్రీలు వేశారు. తద్వారా సదరు సంస్థ టెండర్‌లో అర్హత సాధించకుండా కథ నడిపించారు. మొత్తంగా తాము అనుకున్న సంస్థలకే ప్రైవేటు ఇసుక డిపో ఏర్పాటుకు అవకాశం కల్పించేలా పక్కా ప్లానింగ్‌తో వ్యవహారం నడిచిందని అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment