ధరణి పుత్రులపైధరల పిడుగు
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో అన్ని రకాల పంటలు కలిపి సుమారు 64,101 హెక్టార్లలో సాగు చేస్తుంటారు.ఈ పంటల కోసం సుమారు 35,353 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తారు.రబీ సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం 16,011 హెక్టార్లుగా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. వీటి సాగు నిమిత్తం సుమారు 15,924 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయి. మొత్తంగా ఏడాదికి రెండు సీజన్లలో 51,364 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను రైతులు వినియోగిస్తారు.ఈ లెక్కన పెరిగిన ఎరువుల ధరలతో జిల్లా రైతాంగంపై ఏడాదికి సుమారు రూ.10 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది.జిల్లాలో పంటల సాగులో వరిదే అగ్రస్థానం. ఎకరా వరికి ఒక బస్తా డీఏపీ,రెండు బస్తాల కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తారు. కూలీ రేట్లు,విత్తనాలు,ఎరువులు,పురుగు మందుల ధరలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి.ఆ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ ధరలు పెరగడంలేదు. ప్రధానంగా రసాయన ఎరువుల ధరలు భారీగా పెరగడంతో తమపై అదనపు భారం పడుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.కూటమి ప్రభుత్వం స్పందించి ఎరువుల ధరలు తగ్గించడంతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం రూ.20 వేలు అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
యలమంచిలి రూరల్: జిల్లాలో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు కీలక దశలో ఉన్నాయి..కొన్ని ప్రాంతాల్లో రబీ సాగుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్న వేళ ఎరువుల ధరల రూపంలో అదనపు భారం పడింది.ఇప్పటికే సాగు పెట్టుబడి వ్యయం పెరిగి..పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు అప్పుల పాలవుతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు పెట్టుబడి సాయం కింద పైసా కూడా అందించలేదు. తాము అధికారంలోకి వస్తే రైతులకు అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల ముందు నమ్మబలికారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఐదు నెలలు పూర్తయింది.కానీ ఆదుకున్నపాపాన పోలేదు.ఈ నేపథ్యంలో ఎరువుల ధరలు భారీగా పెరగడంతో వారిపై మరింత భారం పడింది. జిల్లాలో రైతులు ఎక్కువగా వినియోగించే కాంప్లెక్స్ ఎరువులు రకాన్ని బట్టి 50 కిలోల బస్తాకు రూ.100 వరకు పెరగడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఎరువుల ఉత్పత్తికి వినియోగించే ముడి పదార్థాల ధరలు పెరిగిపోవడంతో ఎరువుల ధరలు పెరిగినట్టు డీలర్లు చెబుతున్నారు.దీంతో పంటల సాగు ఖర్చు ఎకరాకు రూ.3 వేల వరకు పెరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు రకాల ధరలు పెంపు
సాగులో ఎక్కువగా వినియోగించే మూడు రకాల ఎరువుల ధరలను ఉత్పత్తి కంపెనీలు పెంచి అన్నదాతలపై భారం మోపాయి.యూరియా మినహా రైతులు ఎక్కువగా వాడే 20–20–013, 14–35–14, 24–24–0 కాంప్లెక్స్ రకాల ఎరువుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మొన్నటివరకు 20–20–013 కాంప్లెక్స్ ఎరువు బస్తా రూ.1,200 ఉండగా ప్రస్తుతం రూ.1,300కు చేరింది.14–35–14 బస్తా ధర రూ.1,700 ఉండేది..ఇప్పుడది రూ.1,800 కు చేరింది.24–24–0 ధర రూ.1,700 నుంచి రూ.1,800 కు పెరిగింది.డీఏపీ ధర పెరిగిందని ఇటీవల కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగినా ప్రస్తుతానికి ఎటువంటి మార్పు లేదని డీలర్లు చెబుతున్నారు. ఇప్పుడు డీఏపీ బస్తా ధర రూ.1,350గా ఉంది.త్వరలోనే ఈ ధర కూడా పెరిగే అవకాశం లేకపోలేదని కొందరు డీలర్లు చెబుతున్నారు.
డాలర్ విలువ పెరగడంతో..
ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరిగి... రూపాయి విలువ పతనమవడంతో ఆ ప్రభావం ఎరువుల తయారీకి వాడే ఫాస్ఫారిక్ ఆమ్లం, అమ్మోనియా లాంటి ముడి సరుకులపై పడింది.అందువల్లే కొన్నిరకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచామని సంబంధిత కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.గత సెప్టెంబర్ వరకు అంతర్జాతీయ మార్కెట్లో టన్ను ఫాస్ఫారిక్ ఆమ్లం ధర 950 డాలర్లు పలకగా ఇప్పుడు ఆ ధర సుమారు 1050 డాలర్లకు చేరింది.పంటలకు కీలకమైన దశలో నైట్రోజన్,ఫాస్ఫరస్.పొటాష్ కలిగిన కాంప్లెక్స్ ఎరువులు వినియోగించాలి.ప్రస్తుతం వీటి ధర పెరగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
అన్ని వర్గాల ప్రజలపై కూటమి ప్రభుత్వం తన ప్రతాపం చూపుతోంది. పేద, మధ్య తరగతి ప్రజలకు బతుకులు భారంగా మారాయి. తాజాగా అన్నదాతలపై ధరల పిడుగు పడింది. ఎరువుల ధరలు విపరీతంగా పెంచేశారు. 50 కిలోల బస్తాకు రూ.100 వరకు పెరగడంతో ఏం చేయాలో పాలుపోక రైతన్నలు దిగులు చెందుతున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎటువంటి పెట్టుబడి సాయం అందకపోవడంతో అప్పుల పాలైన రైతులపై అదనపు భారం పడడం మరింత కుంగదీసింది. ఎరువుల ధరల పెరుగుదల కారణంగా జిల్లాలోని అన్నదాతలపై రూ.10 కోట్ల అదనపు భారం పడుతోంది.
రూ.10 కోట్ల అదనపు భారం
భారీగా పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు
బస్తాకు రూ.100 వరకు పెంపు
జిల్లా రైతాంగంపై ఏడాదికి రూ.10 కోట్ల అదనపు భారం
పెరగనున్న పెట్టుబడి వ్యయం
ప్రస్తుతం ఎరువుల ధరలు
50 కిలోల బస్తా ధర (రూపాయల్లో)
20–20–013 1,300
డీఏపీ 1,350
14–35–14 1,800
28–28–0 1,700
పొటాష్(ఎంఓపీ) 1,500
10–26–26 1470
అమ్మోనియం సల్ఫేట్ 9,25
15–15–15 ప్యాక్డ్ 1,250
24–24–0 1,800
యూరియా(45 కిలోల బస్తా) 266
16–16–16 1,375
12–32–16 1,470
ఎరువుల ధరలు బాగా పెరిగాయి
కాంప్లెక్స్ ఎరువుల ధరలు బాగా పెరిగాయి.గతంలో ఎప్పుడూ ఒకేసారి ఇలా పెరగలేదు.పురుగుమందుల ధరలు కూడా పెరుగుతున్నాయి.దుక్కి దున్నింది మొదలు అన్ని రకాల ఖర్చులు పెరిగాయి.దీంతో ఎకరానికి గతంలో కంటే రూ.2,500 నుంచి రూ.3,000 వరకు రైతులపై భారం పడుతోంది.పెరిగిన ఎరువుల ధరలపై పునరాలోచించి ధరలను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– మొగిలి నర్సింగరావు,రైతు,పీఎన్‌ఆర్‌పేట, యలమంచిలి మండలం
వ్యవసాయం ఎలా చేయాలి
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది రైతుల పరిస్థితి. పెట్టుబడి ఖర్చులతో వ్యవసాయం భారంగా మారిన తరుణంలో ఇలా ఎరువుల ధరలు పెంచడం దారుణం. వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంది.ఎరువుల ధరలకు రెక్కలు రావడంతో మా ప్రాంతంలో రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోతే అప్పుల పాలుకాక తప్పదు. – పందల వరలక్ష్మి,రైతు,గోకివాడ,
రాంబిల్లి మండలం
మోయలేని భారం
అసలే సాగు పెట్టుబడులు పెరిగి వ్యవసాయం అంటేనే భయపడుతున్న తరుణంలో ఎరువుల ధరలు పెంచడం దారుణం.వీటిని నియంత్రించాలి. పెరిగిన ధరలతో సాగు చేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితి వచ్చింది. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే పెరిగిన ఎరువుల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి.
– కర్రి అప్పారావు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు
ధరలు నియంత్రించాలి
ప్రభుత్వాలు రైతుల పరిస్థితిని పట్టించుకోకుండా తరచూ ఎరువుల ధరలు పెంచడం చాలా దారుణం.రైతులు సాగు చేస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైన ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ఎరువుల ధరలు పెంచడం సరికాదు.ఽరైతుల పరిస్థితిని అర్థం చేసుకొని ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
– కాళ్ల శ్రీనివాసరావు, రైతు,పోతురెడ్డిపాలెం, యలమంచిలి మండలం
Comments
Please login to add a commentAdd a comment