ఉసురు తీసిన ఉపాధి
● నేవల్‌బేస్ ప్రాజెక్ట్‌లో విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి ● మృతుడు దొరాజియా కనస్ట్రక్షన్ కంపెనీ ఉద్యోగి ● న్యాయం చేయాలంటూ బంధువులు,సీపీఎం నేతల ఆందోళన
రాంబిల్లి (యలమంచిలి): నేవల్‌బేస్ ప్రాజెక్ట్ ప్రహరీ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో దొరాజియా కనస్ట్రక్షన్ కంపెనీ ఉద్యోగి మృతి చెందాడు. రాంబిల్లి సీఐ సీహెచ్.నర్సింగరావు, మృతుని బంధువులు, స్థాఽనికులు తెలిపిన వివరాలు... పరవాడ గ్రామానికి చెందిన బండారు నీలబాబు(39) దొరాజియా కనస్ట్రక్షన్ కంపెనీలో ఫ్లోర్‌మన్‌గా చాలా కాలంగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా రాంబిల్లి మండలం మన్యపు చింతువా నేవీ కాలనీ సమీపంలో నేవల్‌బేస్ రక్షణ గోడ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో గోతుల వద్ద బుధవారం ఐరన్‌టేపుతో కొలతలు సేకరిస్తున్నాడు. ఆ ఐరన్‌టేపు పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్‌షాక్‌కు గురై ఘటనా స్థలంలో కుప్పకూలిపోయాడు. తోటి ఉద్యోగులు హుటాహుటిన రాంబిల్లి పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే నీలబాబు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య సునీత, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. నీలబాబు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి వద్ద గుండెలవిసేలా విలపించారు. నీలబాబు అందరితో కలసిమెలసి ఉండేవాడని స్థానికులు తెలిపారు.
ఆస్పత్రి వద్ద ఆందోళన
విద్యుత్ షాక్‌తో మృతి చెందిన బండారు నీలబాబుకు కంపెనీ యాజమాన్యం నష్ట పరిహారం అందజేసి, ఆదుకోవాలని మృతుని బంధువులు, సీఐటీయూ నేతలు రాంబిల్లి పీహెచ్‌సీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నష్టపరిహారం చెల్లించనిదే మృతదేహాన్ని శవపంచనామాకు తరలించనివ్వబోమని భీష్మించుకు కూర్చుకున్నారు. నష్టపరిహారం చెల్లించేందుకు ఎట్టకేలకు బుధవారం రాత్రి కంపెనీ యాజమాన్యం హామీ ఇచ్చింది. దీంతో మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించినట్టు రాంబిల్లి సీఐ సీహెచ్ నర్సింగరావు తెలిపారు. ఈ ఘటనపై మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేసినట్టు సీఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment