సిరులతల్లి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు
డాబాగార్డెన్స్ (విశాఖ): మార్గశిర మాస మూడో గురువారం కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టౌన్ కొత్త రోడ్డు నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రీడింగ్ రూమ్ వద్ద ధర్మదర్శనంతో పాటు రూ.100 శీఘ్ర దర్శనం, రూ.200 ప్రత్యేక దర్శనంతోపాటు రూ.500 ఉత్సవ ప్రత్యేక దర్శనం ప్రవేశ క్యూలైన్ల టికెట్లు ఇస్తారు. సీతారామస్వామి ఆలయం వైపు నుంచి వీవీఐపీ, వీఐపీతోపాటు వృద్ధులు, వికలాంగులు, రూ.200, రూ.500 టికెట్ తీసుకున్న వారికి దర్శనం కల్పించనున్నారు. అమ్మవారి ఆలయ వెనుక భాగం, ఆలయ ప్రధాన ద్వారం (వీటీ కాలేజ్ వద్ద), దర్శనం అనంతరం బయటకు వచ్చే మార్గంలో ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయ సమీపంలో పోలీస్ అవుట్ పోస్ట్‌తోపాటు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. టౌన్‌కొత్తరోడ్డు, ఘోషాస్పత్రి, అమ్మవారి ఆలయం వెనుక భాగంలో చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోలీసుల బందోబస్త్ ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగుల కోసం వీల్‌చైర్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శోభారాణి తెలిపారు. బుధవారం ఆమె సాక్షితో మాట్లాడుతూ అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న దృష్ట్యా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ ప్రాంగణంతోపాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment