తుపాను గుబులు
వరుస తుపానులు వరి రైతుల వెన్ను విరుస్తున్నాయి. ప్రస్తుత వర్షాలు మరిన్ని రోజులు కురిస్తే పూర్తిగా నష్టపోతామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పండిన పంటను రక్షించుకునేందుకు రైతులు ఆందోళనతో ఉరుకులు పరుగులు తీస్తున్నారు.
రైతుల గుండెల్లో
పొలంలో ఆరబెట్టిన పంటను మోపులు కట్టి కల్లాలకు తరలిస్తున్న రైతులు
వరి కుప్పలను కాపాడే పనిలో రైతులు
తడిసి ముద్దయిన వరి పంటతో అన్నదాతకు తీవ్ర నష్టం
పొలంలో ఆరబెట్టిన పంటను కల్లాలకు తరలించడంలో నిమగ్నం
చోడవరం: ఈ ఏడాది ఇప్పటి వరకు తుపానులు ఇబ్బంది పెట్టలేదు. గత నెలలో తుపాను వచ్చినా అప్పటికి వరి కోతలు ప్రాథమిక దశలోనే ఉండటంతో జిల్లా రైతులకు పెద్దగా నష్టం జరగలేదు. కానీ ఇప్పుడు వచ్చిన అల్పపీడన ద్రోణి కారణంగా ఈ రెండ్రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో గ్రామాల్లో రైతులు పొలాల్లోకి పరుగులు తీస్తున్నారు. వరి పంట పూర్తిగా పక్వానికి రావడంతో వరి కోతలు జిల్లా అంతటా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తుపాను ఆవరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ వరి విస్తీర్ణం (ఈ క్రాప్‌లో నమోదయింది) 56,410 హెక్టార్లు అయినప్పటికీ.. చెరకు సాగుకు బదులు వరి సాగు అదనంగా చేపట్టడంతో 1500 హెక్టార్ల వరకు విస్తీర్ణం పెరిగింది. సుమారు 58 వేల హెక్టార్లలో ఆశాజనకంగానే వరి సాగు జరిగింది. ప్రధానంగా చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, పాడేరు నియోజకవర్గాల్లో ఎక్కువగా సాగు జరిగింది. ఇప్పటికే 50 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోనే ఈ ఏడాది 54 వేల ఎకరాల్లో వరి పంట వేశారు. సకాలంలో వరినాట్లు వేయడంతో పంట పూర్తిగా కోతకు వచ్చింది. తేలిక రకాలతోపాటు సోనామసూరి, సాంబమసూరి వంటి బీపీటీ రకాలు కూడా కోతకు రావడంతో అవి కూడా కోతలు కోసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఆర్‌జీఎల్, సూపర్ జయ, స్వర్ణ వంటి రకాలు ఇప్పటికే కోతలు కోసి కుప్పలు వేసేందుకు పొలాల్లో ఆరబెట్టి ఉంది. మిగతా చోట్ల కూడా పంట పక్వానికి రావడంతో అవి కూడా కోతలు కోసే పనిలో రైతులు ఉన్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పంట కోతకోసి సరిగ్గా ధాన్యం చేతికొచ్చే సమయంలో అల్పపీడనం ఆవరించడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే కోసిన పంటను పొలం నుంచి బయటకు తీసి కుప్పలు వేసే పనిలో వారు నిమగ్నమయ్యారు. ఉన్న పంటను హుటాహుటిన ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ల సాయంతో కల్లాలు, పాకల వద్దకు తరలించి కుప్పలు పెడుతున్నారు. మరోపక్క కోతకు వచ్చిన పంటను హడావిడిగా కోత కోస్తున్నారు. ఒకవేళ తుపాను వర్షాలు భారీగా కురిస్తే పంట పూర్తిగా నేలకొరిగి, నీట మునిగి నష్టాలపాలవుతుందనే ఆందోళన నెలకొంది. ఈ ఏడాది సోనామసూరి, సాంబమసూరి రకాలు కూడా ఎక్కువగా వేశారు. ఈ రకాలు చిన్నపాటి తుపాన్లను కూడా తట్టుకోలేవు. దీంతో చాలాచోట్ల వరి పంట ఈదురుగాలులు, వర్షానికి పొలంలోనే నేలకొరిగింది. ఆందోళన చెందుతున్న రైతులు గింజ కట్టి మరో వారం రోజుల్లో కోయాల్సిన పంటను సైతం ఇప్పుడే కోసేస్తున్నారు. రావికమతం, బుచ్చెయ్యపేట, చోడవరం, దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల, కె.కోటపాడు మండలాల్లో కూలీల కొరత తీవ్రంగా ఉంది. కొన్ని గ్రామాల్లో రైతులు ఒకరికొకరు సాయం చేసుకుంటూ పంటను రక్షించుకునే పనిలో పడ్డారు. కుప్పలు పెట్టిన పంటను రక్షించుకునేందుకు కుప్పలకు తార్పాలు కప్పుతున్నారు.
తడిసిన వరి పనలపై ఉప్పునీరు పిచికారీ చేయాలి
తుమ్మపాల: జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో వరి పంట 56,410 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయగా ఇప్పటివరకు 21,142 హెక్టార్లలో (38 శాతం) కోతలు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహనరావు తెలిపారు. వరి కోతలను వర్షాలు తగ్గే వరకు వాయిదా వేసుకోవాలన్నారు. కోత కోసి పెట్టిన కుప్పల్లో వర్షం నీరు చేరినప్పుడు గింజ మొలకెత్తకుండా ధాన్యం రంగు మారకుండా ఉండేందుకు వర్షాలు తెరిపిచ్చిన తర్వాత ఉప్పునీరు కలిపి కంకులపై చల్లాలని సూచించారు. కోయని పంటను పొలంలోనే ఐదారు వరి దుబ్బులను ఒక దుబ్బుగా కట్టి ఉంచితే ఈదురుగాలులకు పంట నేలకొరగదని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment