వరి కోతలు వాయిదా వేసుకోవాలి
● కోసిన పంటను సంరక్షించాలి
● వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు జేసీ విజ్ఞప్తి
తుమ్మపాల: తుపాను కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో వరి సాగు చేసిన రైతులు రాబోయే రెండు మూడు రోజుల్లో కోతలు వాయిదా వేసుకోవాలన్నారు. ఇప్పటికే కోసిన పంటను సురక్షిత స్థలంలో ఎత్తయిన ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలని, కోసిన పంటపై టార్పాలిన్ కప్పి వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకుని పంట నాణ్యత కాపాడాలన్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం రక్షణకు 600 టార్పాలిన్లను అవసరమైన రైతులకు పంపిణీ చేశామని తెలిపారు. అవసరమైతే మరిన్ని టార్పాలిన్లను కొనుగోలు చేసి అందిస్తామన్నారు. వర్షాల కారణంగా ధాన్యం విక్రయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లు 8008901584, 9492821030కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.
ధాన్యం సేకరణకు ఈనెల 9వ తేదీ నుంచి 72 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 406.16 మెట్రిక్ టన్నుల ధాన్యం 124 మంది రైతుల దగ్గర కొనుగోలు చేశామని, 117 మంది రైతుల ఖాతాలో రూ.87 లక్షలు జమ చేయడం జరిగిందని తెలిపారు. దళారులను నమ్మి తక్కువ ధరకు తమ ధాన్యాన్ని అమ్ముకోవద్దని రైతులకు ఆమె విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment