‘రిమాండ్ ఖైదీ నేరస్తుడు కాదు’
చోడవరం రూరల్: రిమాండ్‌లో ఉన్నంత మాత్రాన ఖైదీ నేరస్తుడు కాదని, నేరం రుజువయ్యే వరకు నిందితుడు మాత్రమేనని న్యాయసేవ ప్రాధికార సంస్థ చైర్మన్, సబ్ జడ్జి వి.గౌరీ శంకరరావు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక సబ్ జైలులోని రిమాండ్ ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ముందుగా ఖైదీలకు రోజువారీ అందిస్తున్న ఆహార పదార్థాల వివరాలను సబ్ జైల్ సూపరింటెండెంట్ బాబూరావును అడిగి తెలుసుకున్నారు. మెనూ అనుసరిస్తున్నదీ, లేనిదీ ఆరా తీశారు. బియ్యాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఖైదీల గదులు, పరిసరాల పరిశుభ్రతపై ఖైదీలతో జైలు సిబ్బంది నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడుతూ ఖైదీలు ఎవరైనా న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితి ఉంటే న్యాయ పరిషత్‌కు చెబితే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు. నేర ప్రవృత్తి ఉన్న వారు తమ వ్యక్తిత్వాలను మార్చుకోవాలని, జైలు నుంచి సత్ప్రవర్తనతో బయటకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల న్యాయ సేవ ప్రాధికార సంస్థ పేనల్ న్యాయవాది భూపతి రాజు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment