కేజీబీవీలో అడుగడుగునా అధికారుల అలక్ష్యం
● 37కు చేరిన బాధితుల సంఖ్య
నర్సీపట్నం : వేములపూడి కేజీబీవీ వసతిగృహంలో అడుగడుగునా అధికారుల అలక్ష్యం కనపడుతుంది. సోమవారమే కొద్ది మంది విద్యార్థుల్లో అనారోగ్య లక్షణాలు బయటపడగా, అప్పుడే విద్యార్థినులు అక్కడ ఉన్న సిబ్బందికి తమ పరిస్థితి గురించి చెప్పారు. కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సిబ్బంది విద్యార్థినులకు నచ్చజెప్పారు. సోమవారం నాటి ఆహారం కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి ఎదురైనట్టు తెలుస్తుంది. అప్పుడే సిబ్బంది మేలుకుంటే విద్యార్థుల పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదని పలువురు చెబుతున్నారు. విద్యార్థుల అస్వస్థతకు ఎవరు బాధ్యులో తేల్చడం లేదు. తూతూ మంత్రం తనిఖీలు చేసి వెళ్లిపోతున్నారు. హాస్టల్ నిర్వహణ అంతా సవ్యంగానే ఉందని సూపరింటెండెంట్ శాంతి సరిపుచ్చుకుంటున్నారు. మరి విద్యార్థినులు అనారోగ్యం బారిన ఎందుకు పడ్డారో ప్రశ్నార్థకంగా మారింది.
అధికారుల పరిశీలన...
వేములపూడి కస్తూర్బా బాలికల వసతిగృహాన్ని గురువారం విద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రవికుమార్ వి ద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వంటశాల, వాటర్‌ప్లాంట్, మరుగుదొడ్లను తనిఖీ చేశారు. మంచినీటి నమూనాలను తీసి పరీక్షల నిమిత్తం పంపించాలని సిబ్బందిని ఆదేశించారు. వి ద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయ్ భాస్కర్, జిల్లా విద్యాశాఖాధికారి అప్పారావునాయుడు వేములపూడి, నర్సీపట్నం ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు.
గురువారం మరో 19 మంది...
కేజీబీవీలో గురువారం నాటికి అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య 37కు చేరింది. సోమవారం నాడు ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురవ్వగా, మంగళవారం నాడు 13 మంది అస్వస్థతకు గురయ్యారు. గురువారం నాడు మరో 19 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో ఏడుగురు, వేములపూడి పీహెచ్‌సీలో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారికి హాస్టల్‌లోనే ప్రత్యేక శిబిరం ద్వారా డాక్టర్ అనూష చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉంది. మరో 48 గంటల పాటు విద్యార్థులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వైద్య సేవలు అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment