సంక్రాంతి సెలవులకని ఇంటికి వెళ్తూ..
● ఆటో నుంచి జారిపడి విద్యార్థిని మృతి ● సోమిదేవపల్లిలో ఘటన
ఎస్.రాయవరం/రోలుగుంట: సంక్రాంతి సెలవులకు స్వగ్రామానికి వెళ్తూ ఆటో నుంచి జారిపడి పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన ఎస్.రాయవరం మండలం సోమిదేవపల్లి సమీపంలో గురువారం చోటు చేసుకుంది. రోలుగుంట మండలం కొండపాలెం గ్రామానికి చెందిన పాము యోగిత(16) ఎస్.రాయవరం మండలం లింగరాజుపాలెం వద్ద మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో చదువుతోంది. శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో పాఠశాల నుంచి తన తల్లి శ్రీదేవి, మరో నలుగురు స్నేహితురాళ్లతో కలిసి వారి స్వగ్రామాలకు బయలు దేరారు. ఈ క్రమంలో అడ్డురోడ్డు నుంచి నర్సీపట్నం రోడ్డు గతుకులుగా ఉండటంతో పెనుగొల్లు నుంచి దార్లపూడి మీదుగా ప్రయాణించారు. సోమిదేవపల్లి సమీపంలో ఆటో మలుపు తిరుగుతుండగా విద్యార్థిని జారిపడి తీవ్రంగా గాయపడింది. ఆమెను అదే ఆటోడ్రైవర్ హుటాహుటిన నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే మృతి చెందింది. ఎస్.రాయవరం పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్న హెచ్‌సీ పవన్ తెలిపారు.
కొండపాలెంలో విషాద ఛాయలు..
రోలుగుంట మండలం కొండపాలెం గ్రామానికి విద్యార్థిని మృతదేహం తీసుకురావడంతో మృతురాలి తల్లిదండ్రులు గోవింద, శ్రీదేవి, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సెలవులకు ఇంటికొస్తున్న కుమార్తెతో కలిసి సంక్రాంతి పండగ ఎంతో ఆనందంగా చేసుకోవాలని పొంగిపోయారు. అంతలోనే రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment