లక్కవరం శివార్లలో మహిళ హత్య
● బంగారం కోసమే హతమార్చినట్టు అనుమానం
చోడవరం: లక్కవరం శివారులోని చెరకు తోటలో ఒక మహిళ హత్యకు గురైంది. గొంతు కోసి హతమార్చిన దుండగులు ఆమె మెడలో ఉన్న బంగారాన్ని అపహరించుకుపోయారు. లక్కవరం గ్రామానికి చెందిన ఒబలరెడ్డి నర్సమ్మ (50) శివారున మారుతీనగర్ సమీపంలో ఉన్న తన పొలంలోకి గురువారం మధ్యాహ్నం గడ్డి కోసేందుకు వెళ్లింది. సాయంత్రం అవుతున్నా ఆమె తిరిగి రాకపోవడంతో భర్త నర్సింహమూర్తి పరిసర పొలాలు, చెరకు తోటల్లో వెతికి చెరకు తోటలో తన భార్య నర్సమ్మ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించాడు. లక్కవరం –గవరవరం రోడ్డును ఆనుకొని ఉన్న చెరకు తోటలో ఈ హత్య జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన మహిళ మెడలో సుమారు 3 తులాల బంగారం పుస్తెల తాడు లేకపోవడంతో బంగారం కోసమే ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. హంతకుడికి ఆమెకు మధ్య పెనుగులాట జరిగినట్టుగా అక్కడ ఉన్న ఆనవాళ్లను బట్టి భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ శ్రావణి, సీఐ అప్పలరాజు హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించారు. నర్సమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment