వివాదాస్పద తీరు.. ఆగడాల్లో సరిలేరు!
● అనంతపురం వన్‌టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్‌పై ఆరోపణలెన్నో..
● కందుకూరి శివారెడ్డి హత్య కేసులో నిందితులకు బాసట
● ప్రాణహాని ఉందని అప్పట్లో వారం ముందే వినతిపత్రం ఇచ్చిన బాధితులు
● అయినా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించి హత్యకు పరోక్షంగా కారణమైన సీఐ
● ప్రసాదరెడ్డి హత్య సమయంలోనూ ఈయనపై విమర్శలు
● ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుపాటి అప్పట్లో రాప్తాడు ఎంపీపీ
● దీంతోనే ఏరికోరి ఇక్కడికి తెచ్చుకున్నారని విమర్శలు
● సెటిల్‌మెంట్లలోనూ దిట్ట అని రాజేంద్రనాథ్‌కు పేరు
● అలాంటి వ్యక్తిని అందలమెక్కించడంపై ప్రజల విస్మయం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: గతంలో రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన రెండు హత్యలు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించాయి. అనంతపురం రూరల్ మండలం కందుకూరులో 2018 మార్చి 30న వైఎస్సార్ సీపీ నేత శివారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.ఇటుకలపల్లి నుంచి స్వగ్రామం వెళ్తుండగా దారిలో కాపుకాచిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో అతి కిరాతకంగా ఆయనను నరికి చంపారు. ఈ హత్యకు వారం రోజుల ముందే రెండు వర్గాల నడుమ గొడవ జరిగింది. ఈ క్రమంలోనే శివారెడ్డి సోదరుడు తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ వినతిపత్రం అందించగా, అప్పట్లో సీఐగా ఉన్న రాజేంద్రనాథ్ యాదవ్ దాన్ని చెత్తబుట్టలో పడేశారు. ఆ తర్వాత వారం రోజులకే శివారెడ్డి హత్య జరి గింది. వినతిపత్రం ఇచ్చినప్పుడే నిందితులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే అసలు హత్యే జరిగి ఉండేది కాదని కందుకూరు గ్రామస్తులు నేటికీ చెబుతున్నారు. శివారెడ్డి హత్యకు పరోక్షంగా సీఐ కూడా కారణమంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు విచారణ అధికారిగా రాజేంద్రనాథ్ ఉంటే బాధితులకు న్యాయం జరగదని మరో పోలీసు అధికారిని ఉన్నతాధికారులు నియమించడం గమనార్హం.
ప్రసాదరెడ్డి హత్య కేసులోనూ..
2015 ఏప్రిల్ 29న ఏకంగా రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలోనే వైఎస్సార్ సీపీ కీలక నేత భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్య నేపథ్యంలోనూ రాజేంద్రనాథ్ వ్యవహార శైలిలో విమర్శలు వచ్చాయి. ప్రస్తుత అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కారును అప్పట్లో శివప్రసాద్ రెడ్డి హత్య కేసు నిందితులు వాడినట్టు తేలింది. ఆ సమయంలో దగ్గుపాటి ప్రసాద్ రాప్తాడు ఎంపీపీగా ఉన్నారు. ఇప్పుడు దగ్గుపాటి అనంతపురం ఎమ్మెల్యే కావడంతో రాజేంద్రనాథ్ ఏకంగా కీలకమైన వన్‌టౌన్‌కు పోస్టింగ్ తెచ్చుకోగలిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సెటిల్‌మెంట్లలో ఘనుడు!
రాప్తాడుకు చెందిన ఓ విలేకరికి, ఆయన అన్నదమ్ములకు మధ్య భూ వివాదం నడుస్తోంది. వీరిలో ఒక వర్గానికి పరిటాల కుటుంబం మద్దతు ఉంది. దీంతో అప్పట్లో మంత్రి అయిన పరిటాల సునీత ఒత్తిడితో విలేకరిపై సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ రెచ్చిపోయారు. విలేకరి చొక్కా పట్టుకుని ‘భూమి మీద నీకు హక్కులేదు, మర్యాదగా వచ్చి సంతకాలు చేస్తావా లేదా’ అని బెదిరించారు. దీంతో బాధిత విలేకరి అప్పట్లో తన మిత్రులతో కలిసి పోలీసుస్టేషన్ ముందు ధర్నాకు దిగగా సీఐ క్షమాపణలు చెప్పారు. ఇలా ల్యాండ్ సెటిల్‌మెంట్లలోనూ ఘనాపాటిగా రాజేంద్రనాథ్ యాదవ్ పేరు తెచ్చుకున్నారు.
తాజాగా స్టూడెంట్ యూనియన్ నేతలపై..
నేటికీ రాజేంద్రనాథ్ యాదవ్ తన వివాదాస్పద వైఖరిని వీడలేదు. స్టూడెంట్ యూనియన్ నాయకులపై ఇటీవల తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయాలంటూ అనంతపురంలోని పెన్నార్ భవన్ వద్ద ధర్నాకు దిగిన ఏఐఎస్‌ఎఫ్ నేతలపై చిందులు తొక్కారు. సీఐ వాడిన భాష అత్యంత జుగుప్సాకరంగా ఉందని, తమను కొట్టడానికి కూడా యత్నించారని, విద్యార్థుల పట్ల కూడా అమాన వీయంగా వ్యవహరించారని విద్యార్థి సంఘం నేతలు వాపోయారు. ఇలా తాను ఎక్కడ పనిచేసినా లెక్కలేనన్ని ‘ఘనతలు’ మూటగట్టుకున్న వ్యక్తికి నగరంలో కీలక స్థానాన్ని కట్టబెట్టడం ఉమ్మడి జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష వేసే పోలీసు బాస్‌లు రాజేంద్రనాథ్ యాదవ్ విషయంలో ఉదారంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
సీఐ రాజేంద్రనాథ్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment