టీడీపీ నాయకుల దౌర్జన్యం
రాప్తాడు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. రోజూ ఏదో ఒక గ్రామంలో దాడులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం రాప్తాడు మండలం వరిమడుగులో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై టీడీపీ నాయకులు దాడి చేసి, బండలను ధ్వంసం చేశారు. బాధితులు తెలిపిన మేరకు... అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ 2014లో రాప్తాడు ఎంపీపీగా ఉన్న సమయంలో ఆయన స్వగ్రామమైన ఎం.బండమీదపల్లి పంచాయతీలోని వరిమడుగు గ్రామ దళితుల అభ్యర్థన మేరకు ఇళ్ల స్థలాలను అందజేశారు. ఇందు కోసం ఎం.బండమీదపల్లి నివాసి వడ్డే ఈశ్వరయ్యకు చెందిన రెండు ఎకరాల పొలాన్ని ఆయన తన సొంత డబ్బు పెట్టి కొనుగోలు చేసి ఒక్కొక్కరికి 2.50 సెంట్ల చొప్పన 30 మందికి అందజేశారు. ఇళ్ల పట్టాలు అందుకున్న వారిలో కొందరు ఆర్డీటీ సహకారంతో పక్కా గృహాలు నిర్మించుకున్నారు. మరికొందరు సొంత డబ్బుతో, ఇంకొందరు ప్రభుత్వ సాయంతో ఇళ్లను నిర్మించుకున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కొందరు దళితులు గృహాలు నిర్మించుకోలేక స్థలాన్ని అలాగే పెట్టుకున్నారు. ఆ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు మంగళవారం ఉదయం జయరాం, జగన్, మోహన్ వారి ప్టాట్ల చుట్టూ బండలు పాతేందుకు గుంతలు తీస్తుండగా... అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు శ్రీరాములు, ఓబులపతి, ఫక్కీరప్ప, రవి, లక్ష్మన్న, అశోక్, సురేష్‌తో పాటు మరికొందరు అడ్డుకున్నారు. అందరూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే కావడంతో ఆ ప్లాట్లను రద్దు చేస్తున్నామని, ఆ పట్టాలు తమకివ్వాలంటూ బండలను పగులగొట్టారు. అడ్డుకోబోయిన జయరాం, మోహన్, జగన్ ఆయన భార్య హైమావతిపై దాడి చేశారు. నోరెత్తితే చంపి అక్కడే పాతి పెడతామని బెదిరించారు. ఆ సమయంలో కొందరు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీస్తుండగా ఎస్పీకి ఫిర్యాదు చేసినా తమనెవ్వరూ ఏమీ చేయలేరంటూ రెచ్చిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment