అనంతపురం: నగరంలో సంచలనం రేపిన గుజ్జల గంగమ్మ అలియాస్ నాగమణి హత్యకేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు త్రీ టౌన్ సీఐ శాంతిలాల్ తెలిపారు. వివరాలను బుధవారం ఆయన వెల్లడించారు. అనంతపురంలోని ఎర్రనేల కొట్టాలలో నివాసముంటున్న నాగమణి (48) హత్య ఉదంతం ఈ నెల 20న ఉదయం వెలుగు చూసింది. ఈ కేసు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు సీఐ శాంతిలాల్ ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా విడిపోయి లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అనంతపురానికి చెందిన చుక్కలూరు జయప్రకాష్ , ఆకుమల్లెల హరినాథ్ బాబు అలియాస్ హరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో నేరం చేసినట్లుగా అంగీకరించారు.
జల్సాలకు అలవాటు పడి
వ్యసనాలకు బానిసలైన హరి, జయప్రకాష్ తమ జల్సాలకు అవసరమైన డబ్బును సులువుగా సంపాదించుకునేందుకు నేరాలను ఎంచుకున్నారు. ఈ క్రమంలో తన పెద్దనాన్న బలిజ రామకృష్ణ ఇంటి రెండో అంతస్తులో ఒంటరిగా అద్దెకు ఉంటున్న నాగమణిపై జయప్రకాష్ దృష్టి పడింది. పథకం ప్రకారం ఈ నెల 19న మధ్యాహ్నం 3 గంటల సమయంలో జయప్రకాష్ వాళ్ల ఇంటిపై నుంచి ఇద్దరూ గోడెక్కి నాగమణి నివాసముంటున్న గది పక్కన దిగారు. అనంతరం నాగమణి ఇంటి తలుపు వద్ద హరి కాపలాగా ఉండగా, గదిలోకి జయప్రకాష్ చొరబడ్డాడు. గమనించిన నాగమణి గట్టిగా కేక వేయబోతుండగా జయప్రకాష్ ఆమెను మంచంపైకి పడేసి ఎడమ చేతిని నోటిపై అదిమి పెట్టి కుడి చేతితో గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం హతురాలి మెడలోని బంగారు చైన్, చెవులకున్న కమ్మలు, వెండి కాళ్ల పట్టీలు, రూ.4 వేల నగదు, సెల్‌ఫోన్ తీసుకుని, గది లోపల, చుట్టుపక్కల కారం పొడి చల్లి ఉడాయించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో భయపడిన నిందితులు నేరుగా ఎర్రనేల కొట్టాల 1వ సచివాలయం వీఆర్వో స్వర్ణలత సమక్షంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు పోలీసులకు లొంగిపోయారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకోనున్నట్లు సీఐ శాంతి లాల్ తెలిపారు. నాగమణిని హతమార్చిన అనంతరం సాక్ష్యాలను రూపుమాపేలా కారంపొడి చల్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ వీరు ఏమైనా నేరాలకు పాల్పడి ఉంటారని, వాటి గురించి ఆరా తీసేందుకు నిందితులను పోలీస్ కస్టడీకి కోరనున్నట్లు సీఐ తెలిపారు.
ఇద్దరి అరెస్ట్
నగలు, నగదు కోసమే హత్య
Comments
Please login to add a commentAdd a comment