గ్రామీణులు ఐకమత్యంతో జీవించాలి
● కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ జగదీష్ సూచన
బుక్కరాయసముద్రం: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో జీవించాలని కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ జగదీశ్ సూచించారు. బుధవారం మండల పరిధిలోని కేకే అగ్రహారం గ్రామంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవంలో వారు పాల్గొన్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. జల్లిపల్లి నాగన్న ఇంటికి వెళ్లి కుటుంబీకులతో మాట్లాడారు. అనంతరం రామాలయంలో పూజలు నిర్వహించి రచ్చకట్ట వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకరు తక్కువ, మరొకరు ఎక్కువ అనే భావనను మనసులో నుంచి తీసివేయాలన్నారు. పిల్లలను బాగా చదివించాలన్నారు. గ్రామాల్లో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎస్పీ జగదీశ్ మాట్లాడుతూ ప్రతి నెలా కేకే అగ్రహారంలో సమావేశాలు నిర్వహించి, ఎస్సీ, ఎస్టీల సమస్యలు తెలుసుకుంటామన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ తప్పని సరిగా ధరించాలన్నారు. చిన్నారులకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వసంతబాబు, ప్రత్యేక అధికారి శ్రీదేవి, బీసీ వెల్ఫేర్ డీడీ ఖుష్బూ కొఠారి, డీటీడబ్ల్యూఓ రామాంజినేయులు, ఎంపీపీ సునీత, తహసీల్దార్ పుణ్యవతి, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాస్, యల్లన్న, సాకే చిరంజీవి, ఏఎండీ ఇమాం, ఎస్సీ ఎస్టీ ఫోరం రాష్ట్ర నాయకులు రామాంజినేయులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment