శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దు
అనంతపురం: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడరాదని, అసాంఘిక శక్తుల ఆట కట్టించి, అంతటా ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉండాలని ఎస్పీ జగదీశ్ అన్నారు. స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయాలన్నారు. ఇప్పటి వరకు నమోదైన వివిధ రకాల కేసులను సర్కిళ్ల వారీగా సమీక్షించారు. పెండింగ్ కేసుల గురించి ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించే విషయంపై సీరియస్‌గా ఆలోచించాలని ఆదేశించారు. ఫాస్ట్ ట్రాక్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి నిందితులకు శిక్షపడేలా చూడాలని స్పష్టం చేశారు. కేసుల నమోదు, ఛేదింపు, నేర నియంత్రణ వంటి అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. మట్కా, పేకాట, గంజాయి, ఇసుక అక్రమ రవాణాను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పేర్కొన్నారు. వివిధ కేసుల్లో నిందితులను గుర్తించి అరెస్టు చేయడం, దర్యాప్తు వేగవంతం, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడంలో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ, ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి, డీఎస్పీలు మహబూబ్‌బాషా, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, రవిబాబు, శ్రీనివాస్, రామకృష్ణుడు సహా సీఐలు, ఎస్‌ఐలు హాజరయ్యారు.
డిజిటల్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలి
డిజిటల్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జగదీశ్ తెలిపారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్‌నేరగాళ్లు వాట్సాప్, స్కైప్ ద్వారా వీడియో కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలను భయపెట్టి, డబ్బు వసూలు చేస్తున్నారు. పోలీసులు వాట్సాప్, స్కైప్ వంటి వాటి ద్వారా వీడియో కాల్స్ చేసి మాట్లాడరన్నారు.ఏదైనా నేరానికి సంబంధించి విచారణ చేయాలనుకుంటే నేరుగా సంప్రదిస్తారని పేర్కొన్నారు.
ఎస్పీ జగదీశ్
పండుగ ఆనందంగా జరుపుకోవాలి
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే దీపావళిని జిల్లా ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ జగదీశ్ ఆకాంక్షించారు. ఈ దీపావళి చీకట్లను పారదోలి ప్రజలందరి జీవితాల్లో కాంతులు నింపాలని కోరుకున్నారు. పండుగ సందర్భంగా పిల్లలు టపాసులు కాల్చే సమయంలో కనీస జాగ్రత్తలు పాటించేలా తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment