ఉచిత విద్యుత్ అందడం లేదు
అనంతపురం అర్బన్: మగ్గం నేస్తున్న తనకు ఉచిత విద్యుత్ పథకం వర్తింపజేయడం లేదని ఓ నేత కార్మికుడు కలెక్టర్ వినోద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ గురువారం స్థానిక ఆకాశవాణి కేంద్రం నుంచి నిర్వహించిన ‘అనంత మిత్ర ఫోన్‌ఇన్’ కార్యక్రమానికి 19 ఫిర్యాదులు అందాయి. కూడేరు మండలం గుట్కూరు గ్రామానికి చెందిన గంగన్న మాట్లాడుతూ ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకుని రెండు నెలలవుతున్నా గతంలో మాదిరిగానే బిల్లు వస్తోందని వాపోయారు. అధికారులను సంప్రదిస్తే స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మగ్గాలు నేసేవారికి ఉచితంగా 100 యూనిట్ల వరకు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. డేటా ఎంట్రీలో నమోదు పేరు కాలేదేమో అధికారులు చూసి సమస్యను పరిష్కస్తారని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్‌కుమార్, ప్రోగ్రాం డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి, డీఈఈ రామకృష్ణ, ఏఈలు భానుప్రకాష్, జేసీ మునిరాజా పాల్గొన్నారు.
ఫిర్యాదులు, కలెక్టర్ సమాధానాలు ఇలా...
● నా పేరు గోవిందరెడ్డి. మాది కళ్యాణదుర్గం మండల గోళ్ల గ్రామం. మేం నలుగురు అన్నదమ్ములం. నా పేరు మీద ఒక ట్రాన్స్‌ఫార్మర్ కావాలని దరఖాస్తు చేసుకున్నా. మా పొలం సర్వే నంబరును అధికారులు తప్పుగా వేశారు. దీంతో ఆలస్యం అవుతోంది. సాగు చేసుకుంటున్న దానిమ్మ, అరటి పంటలు నష్టపోయే అవకాశం ఉంది.
● కలెక్టర్ సమాధానం: మీ ఫోన్ నంబరు, పేరు, సమస్యను నమోదు చేశాం. ఇంజినీర్లు మిమ్మల్ని సంప్రదించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు.
● నా పేరు రాఘవేంద్ర. పెద్దవడుగూరు మండలం బీసీ కాలనీ. 2003లో మా ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. అప్పట్లో ప్రైవేటు స్థలంలో స్తంభాలు ఏర్పాటు చేశారు. స్థలం వారు అభ్యంతరం తెలపడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో కొత్తగా స్తంభాలను నాటారు. అయితే విద్యుత్ తీగలు ఏర్పాటు చేయలేదు. దీంతో కరెంట్ సరఫరా కావడం లేదు. అధికారులను అడిగితే ‘ప్రభుత్వం నుంచి కేబుల్ సరఫరా లేదు. ఇంకా ఆలస్యం అవుతుంది. సొంతంగా ఏర్పాటు చేసుకోవాలన్నారని’ చెప్పారు.
● కలెక్టర్: ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, తీగలు అవసరమని ఇటీవల ప్రభుత్వానికి నివేదించాం. 40 ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ తీగలు వచ్చాయి. మీ ఫిర్యాదుకు ప్రాధాన్యత ఇస్తూ సమస్యను పరిష్కరిస్తాం.
● నా పేరు వెంకట కృష్ణమూర్తి. శింగనమల మండలం ఉల్లికల్లు ఎస్సీ కాలనీ. మా ఇంటికి 2016లో విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాం. విద్యుత్ బిల్లు రూ.22 వేలు రాగా, విషయాన్ని అధికారులకు చెప్పా. దీంతో వారు ఎంతోకొంత చెల్లించి ఒక అర్జీ ఇవ్వాలని చెప్పడంతో రూ.1,400 కట్టాను. ఈ విషయంపై ఇప్పటి వరకు ఏఈ నుంచి ఎలాంటి స్పందన లేదు.
● కలెక్టర్: అంత మొత్తం బిల్లు ఏ సంవత్సరం, ఏ నెలలో వచ్చిందో చెప్పడం లేదు. చాలా నెలల నుంచి సమస్య ఉందని అంటున్నారు. బిల్లును జాగ్రత్తపరిచి ఉండాల్సింది. పేరు, ఫోన్ నంబరు నమోదు చేసుకున్నాం. ఏఈ మిమ్మల్ని కలిసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఎస్సీ గృహాలకు 100 యూనిట్ల వరకు ప్రభుత్వం రాయితీ ఉంటుంది. అంతకు మించి వినియోగించిన విద్యుత్తుకు బిల్లు కట్టాలి.
కలెక్టర్‌కు నేత కార్మికుడి ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment