నేరాలపై ఉక్కుపాదం
అనంతపురం: నేరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గురువారం జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించని వారు, త్రిబుల్ రైడింగ్, ఓవర్ లోడింగ్, డ్రంకన్ డ్రైవింగ్ తదితర రోడ్డు భద్రతా ఉల్లంఘనదారులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం 515 కేసులు నమోదు చేశారు. రూ.1,46,090 జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 59 కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 19 కేసులు నమోదు చేశారు. అలాగే, ఆత్మకూరు, రాయదుర్గం పోలీసులు వేర్వేరుగా పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి రెండు కేసులు నమోదు చేశారు. 16 మందిని అరెస్ట్ చేసి రూ.46,260 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్లలో అర్ధరాత్రి వేళ అనుమానాస్పదంగా సంచరిస్తున్న అపరిచితులు 110 మందిని తనిఖీ చేసి 16 మందిని పోలీసు స్టేషన్లకు తరలించారు. ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 163 ఏటీఎం సెంటర్లను తనిఖీ చేశారు.
● నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ పి. జగదీష్ తెలిపారు. జిల్లాలో మట్కా, పేకాట తదితర అసాంఘిక కార్యకలాపాలకు తావుండకూడదన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రజలు కూడా సహకారం అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment