పరిశ్రమలతోనే జిల్లా సమగ్రాభివృద్ధి
అనంతపురం అర్బన్: పరిశ్రమల ద్వారానే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ శివనారాయణశర్మతో కలిసి జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలని చెప్పారు. సింగిల్‌విండో పోర్టల్ ద్వారా చేసుకున్న దరఖాస్తులకు అనుమతులు నిర్ణీత వ్యవధిలో ఇవ్వాలని ఆదేశించారు. పీఎంఈజీపీ ద్వారా రుణం మంజూరైన యూనిట్లు అన్నీ గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలను యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని సూచించారు. ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా యూనిట్ల సబ్సిడీ మంజూరుకు ఆమోదం తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆర్‌ఆర్‌బీ అభ్యర్థుల
కోసం ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు : ఆర్‌ఆర్‌బీ (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24, 25, 26, 27వ తేదీల్లో హుబ్లీ–కర్నూలు సిటీ (07315) మధ్య నడిచే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు హుబ్లీ జంక్షన్ నుంచి రాత్రి 8.15 గంటలకు బయలదేరి కర్నూలు రైల్వేస్టేషన్‌కు మరుసటి రోజు ఉదయం 6.00 గంటలకు చేరుతుందని పేర్కొన్నారు. తిరగి ఈ రైలు ఈ నెల 25, 26, 27, 28వ తేదీల్లో ఈ రైలు కర్నూలు రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 7.30 గంటలకు బయలుదేరి హుబ్లీ జంక్షన్‌కు సాయంత్రం 4,15 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ రైళ్లు గదగ్, కొప్పల్, హాస్పేట్, తోర్నగల్, బళ్లారి, గుంతకల్లు, డోన్ మీదుగా రాకపోకలు సాగిస్తుందని వివరించారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆకతాయిల ఆటకట్టు
అనంతపురం: రోడ్లపై బుల్లెట్‌లా దూసుకెళ్తూ ప్రయాణికులను, వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆకతాయిలను రాప్తాడు పోలీసులు ఆటకట్టించారు. 650 సీసీ బైకులతో బైక్ రైడింగ్ చేస్తున్న మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘రయ్‌మంటూ హడలెత్తిస్తూ..’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఎస్పీ స్పందించారు. తక్షణమే ఆకతాయిలపై దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాప్తాడు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తొమ్మిది మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పునరావృతం అయితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కసాపురంలో అర్ధ మండల దీక్షలు ప్రారంభం
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో శుక్రవారం హనుమాన్ అర్ధ మండల దీక్షలు ప్రారంభమయ్యాయి. వేకువజామునే ఆలయ ముఖమండపంలో ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు, అర్చకులు హనుమాన్ మాలధారణ కార్యక్రమాన్ని చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment