సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) కార్యాలయం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈబీ దేవి చుట్టూ అవినీతి ఆరోపణలు వైఫైలా అల్లుకుపోయాయి. అనధికారికంగా డిప్యుటేషన్లు వేసి లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఆమె మెడకు చుట్టుకున్నాయి. తాను ఎలాంటి డిప్యుటేషన్లూ వేయలేదని చెబుతున్నా..కొంతమంది ఉద్యోగులు పనిచేస్తున్న చోటు కాకుండా డిప్యుటేషన్ వేసిన చోట ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్) వేస్తుండటంతో అసలు విషయం బయటపడింది. దీనికితోడు తాజాగా ఉరవకొండ మలేరియా సబ్‌యూనిట్ ఉద్యోగి కోదండరామిరెడ్డి ఫిర్యాదులు, వాయిస్ రికార్డులు పలువురికి ఉచ్చుబిగించాయి. సొంత శాఖలోని ఉద్యోగులే బహిరంగ విమర్శలు చేయడంతో ఆరోగ్యశాఖ పరువు బజారున పడినట్టయ్యింది.
లావాదేవీలకు మధ్యవర్తిగా ఏఓ
డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అటెండర్ నుంచి అధికారి వరకూ ఏ చిన్న పనికి వెళ్లినా కాసులు పీక్కుతింటున్నారని పీహెచ్‌సీ ఉద్యోగులు వాపోతున్నారు. లావాదేవీల కోసం డీఎంహెచ్‌ఓకు అడ్మిని స్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) గిరిజా శంకర్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. తొలుత ఇక్కడ సెటిల్ అయితేనే ఫైలు అక్కడకు వెళ్తుంది. లేదంటే ఇక్కడే ఆగిపోతుంది. గతంలో పలు ప్రైవేటు క్లినిక్‌ల కేసులు గిరిజాశంకర్ వద్దే సెటిల్ చేసుకుని ఆ తర్వాత డీఎంహెచ్‌ఓకు పంపేవారు. ప్రైవేటు నర్సింగ్‌హోంలు, క్లినిక్‌ల అరాచకాలకు బలైన బాధితులకు న్యాయం జరిగేది కాదని, డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోనే సెటిల్ చేసుకుని తిరిగి వారికి వెంటనే అనుమతులు ఇచ్చేవారని ఓ అధికారి వాపోయారు.
వాయిస్ రికార్డుల హల్‌చల్
ఉరవకొండలో పనిచేసే మలేరియా విభాగం ఉద్యోగి కోదండరామిరెడ్డి ఇటీవల డీఎంహెచ్‌ఓపై కలెక్టర్‌కు, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదులు చేశారు. వాస్తవానికి కోదండరామిరెడ్డిపైనా అవినీతి ఆరోపణలున్నాయి. విధులకు సరిగా వెళ్లకపోవడం, అనధికారిక గైర్హాజరు వంటివాటితో ఆయన్ను సర్వీసు నుంచి తొలగించే వరకూ వెళ్లింది. అలాంటి వ్యక్తి ఫిర్యాదులు చేయడం, పలువురితో మాట్లాడిన వాయిస్‌లు బయటపెట్టడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అవినీతి బహిర్గతమైంది. దీంతో కోదండరామిరెడ్డిని మూడు రోజుల క్రితమే కడపలోని ప్రాంతీయ సంచాలకుల కార్యాలయానికి కలెక్టర్ సరెండర్ చేశారు.
డీసీహెచ్‌ఎస్ సంభాషణ కలకలం
వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయకర్త (డీసీ హెచ్‌ఎస్) డాక్టర్ పాల్ రవికుమార్ వాయిస్ రికార్డు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోదండరామిరెడ్డితో మాట్లాడిన వాయిస్ రికార్డు చక్కర్లు కొడుతోంది. ప్రజారోగ్యశాఖకు చెందిన కోదండరామి రెడ్డితో పాల్ రవికుమార్ మాట్లాడాల్సిన అవసరం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. వీరి సంభాషణ ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. తాజా వాయిస్ రికార్డులతో పాల్ రవికుమార్ పీకల్లోతు ఊబిలో ఇరుక్కున్నట్టయింది. అసలే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యం పడకేసి కనీసం టీకాలకు దిక్కులేని పరిస్థితి ఉండగా.. ఇక్కడేమో కార్యాలయ అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారు. మరోవైపు డీఎంహెచ్‌ఓ కార్యాలయ పనితీరుపై కలెక్టర్ సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది.
గందరగోళంగా డీఎంహెచ్‌ఓ కార్యాలయ పనితీరు
ఉన్నతాధికారి చుట్టూ వైఫైలా అవినీతి
లంచాల కోసం అనధికారిక డిప్యుటేషన్లు వేశారని ఫిర్యాదులు
కలకలం రేపుతున్న వాయిస్ రికార్డులు
Comments
Please login to add a commentAdd a comment