No Headline
గార్లదిన్నె/పుట్లూరు/అనంతపురం మెడికల్: గార్లదిన్నె సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది కూలీలు దుర్మరణం చెందడం,మరో ఐదుగురు తీవ్రంగా గాయపడడంతో జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వీరంతా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన వారు. పైగా అందరిదీ ఒకే సామాజిక వర్గం. గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్ద అరటి తోటలో పనులు పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు.
మిన్నంటిన ఆర్తనాదాలు
సర్వజనాస్పత్రిలో క్షతగాత్రులు, బాధిత కుటుంబీకుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రమాద వార్త తెలుసుకున్న ఎల్లుట్ల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి తరలివచ్చారు. మృతులతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. విగతజీవులుగా పడి ఉన్న తమ వారిని చూసి కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. మృతుల కుటుంబీకులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రి క్యాజువాలిటీ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా: కలెక్టర్
మృతుల కుటుంబీకులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎస్పీ జగదీష్‌తో కలిసి క్షతగాత్రులను ఆయన పరిశీలించారు. ఒకేసారి ఎనిమిది మంది కూలీలు మరణించడం బాధాకరమన్నారు. తీవ్రంగా గాయపడిన గంగాధర్, రామాంజినమ్మ, నీలకంఠ, పెద్దులమ్మ, లక్ష్మిదేవిని మెరుగైన చికిత్స కోసం కిమ్స్–సవీర ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కాగా, ఆస్పత్రిలో క్షతగాత్రులను మంత్రి సవిత పరామర్శించారు.
ఎస్పీ దిగ్భ్రాంతి..
ఘోర రోడ్డు ప్రమాదంపై ఎస్పీ జగదీష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంపై ఆరా తీశారు.
మృతులు
బాలపెద్దయ్య అలియాస్ తాతయ్య (55), చిన్ననాగమ్మ (48), డి.రామాంజినమ్మ (47), పెద్ద నాగమ్మ (60), చిన్ననాగన్న (55),
జయరాముడు(48), కొండమ్మ(50),ఈశ్వరయ్య (55)
క్షతగాత్రులు
లక్ష్మిదేవి, పెద్దులమ్మ, బి.రామాంజినమ్మ, గంగాధర్, ఆటో డ్రైవర్ నీలకంఠ.
రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది కూలీల మృత్యువాత
ఐదుగురికి గాయాలు
మృతులంతా ఒకే
సామాజిక వర్గానికి చెందిన వారు
శోకసంద్రంలో ‘ఎల్లుట్ల’
గుండెలవిసేలా రోదించిన కుటుంబీకులు
Comments
Please login to add a commentAdd a comment