‘నర్సాపురం’ భూముల ధరలపై నివేదిక ఇవ్వండి
అనంతపరం అర్బన్: బెళుగుప్ప మండలం నర్సాపురం పరిధిలో రైల్వే స్టేషన్ నిర్మించనున్న నేపథ్యంలో రైతుల నుంచి భూములు సేకరించనున్నందున ఆ గ్రామంలో ఏడాది కాలంలో జరిగిన క్రయవిక్రయాలను పరిశీలించి పక్కా నివేదిక ఇవ్వాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. రైల్వే స్టేషన్‌కు భూ సేకరణ అంశంపై కలెక్టర్ శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ శివనారాయణశర్మతో కలిసి అధికారులతో సమీక్షించారు. రైల్వే స్టేషన్ నిర్మాణానికి నర్సాపురంలో సర్వే నంబరు 177లో 9.92 ఎకరాలు, సర్వే నంబరు 178లో 8.95 ఎకరాలు మొత్తం 17.97 ఎకరాలను 17 మంది రైతుల నుంచి సేకరించాల్సి ఉందన్నారు. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరాకు రూ.6.25 లక్షలు అని తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్‌లో ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.33 లక్షల వరకు ధర ఉందని, ఆ ప్రకారమే తమకు ఇవ్వాలని రైతులు కోరుతున్నారన్నారు. కావున గ్రామ పరిధిలో ఏడాది కాలంలో జరిగిన భూముల క్రయివిక్రయాలపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ ధర కంటే ఎక్కువకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఆధారాలతో నివేదిక సమర్పించాలని చెపారు. గ్రామ పరిధిలో భూ క్రయవిక్రయాలు జరిగి ఉండకపోతే... సమీప గ్రామాల్లో జరిగిన క్రయవిక్రయాల వివరాలు ఇవ్వాలన్నారు. గ్రామస్థాయిలో వీఆర్‌ఓ, తహసీల్దారు, మండల సబ్ రిజిస్ట్రార్ సంయుక్తంగా పరిశీలించి నివేదికలను జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపించాలన్నారు. జిల్లా రిజిస్ట్రార్ దానిని డీఎల్‌ఎన్‌సీ సమావేశంలో సమర్పిస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు వాటికి ఆమోదిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, రైల్వే శాఖ ఈఈ జగదీష్‌సాయి, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment