స్ఫూర్తిదాయకంగా ఉద్యోగుల క్రికెట్
అనంతపురం: యువతలో స్ఫూర్తి రగిలించేలా ఐపీఎల్ తరహాలో ఉద్యోగుల క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ అన్నారు. ఏపీ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్, ఏపీ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫాదర్ ఫెర్రర్ ఉద్యోగస్తుల క్రికెట్ టోర్నీని ఆదివారం అనంతక్రీడాగ్రామంలో ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఉద్యోగులకు ఆటవిడుపుతో పాటు ఆరోగ్యానికి, మానసికోల్లాసానికి ఈ తరహా పోటీలు దోహదపడతాయన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లను తయారు చేయడమే లక్ష్యంగా ఆర్డీటీ పనిచేస్తోందన్నారు. వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చేసిన సేవలకు గుర్తుగా ఏటా ఆయన జ్ఞాపకార్థం ఉద్యోగస్తులకు, జర్నలిస్టులకు క్రికెట్ టోర్నీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ టోర్నీలో 20 జట్లు ప్రాతినిథ్యం వహిస్తున్నాయన్నారు. బార్ కౌన్సిల్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది గురుప్రసాద్, అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఇన్‌చార్జి కార్యదర్శి భీమలింగారెడ్డి, జుడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment