కర్నూలు జిల్లా 'మిర్చి' రైతులకు మంచిరోజులు.. | Establishment of Mirchi Yard at Nandyala Agreement With ITC | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లా 'మిర్చి' రైతులకు మంచిరోజులు..

Published Fri, Oct 29 2021 11:58 AM | Last Updated on Fri, Oct 29 2021 3:05 PM

Establishment of Mirchi Yard at Nandyala Agreement With ITC - Sakshi

కర్నూలు జిల్లా మిర్చి రైతులకు మంచిరోజులు వచ్చాయి. పంట అమ్ముకోవడానికి ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రోజుల తరబడి నిరీక్షించాల్సిన అగత్యమూ తప్పింది. నంద్యాలలో త్వరలోనే మిర్చి యార్డు ఏర్పాటు కానుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లాలో మిర్చి ఎక్కువగా పండించే ప్రాంతం నంద్యాల డివిజన్‌. ఇక్కడ పండిన పంటను అమ్ముకోవడానికి రైతులు గుంటూరు మిర్చి యార్డును ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడికి వెళ్లిన తర్వాత పంటను అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో మిర్చి యార్డు ఏర్పాటు చేస్తే రైతులకు అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తీసుకునివెళ్లారు. దీనికి స్పందించిన సీఎం నంద్యాలలో మిర్చియార్డు ఏర్పాటు చేసే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మార్కెటింగ్‌ కార్యదర్శి ప్రద్యుమ్నకు ఆదేశాలు జారీ చేశారు.   

పూర్తయిన కసరత్తు.. 
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నంద్యాలలో మిర్చి యార్డు ఏర్పాటు అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేశారు. నంద్యాల పట్టణంలోని 17 ఎకరాల్లో విస్తరించి ఉన్న టెక్కె మార్కెట్‌యార్డులో  యార్డును ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్, హార్టికల్చర్‌ అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి పంట కొనుగోలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందుకోసం రైతులు, కోల్డ్‌ స్టోరేజ్‌ నిర్వాహకులు, వ్యాపారులతో 2 విడతలుగా సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా పంటను కొనుగోలు చేసే వారికి లైసెన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. గుంటూరు మిర్చి యార్డులో ఐటీసీ సంస్థ ఎక్కువగా  పంటను కొనుగోలు చేస్తోంది. ఆ సంస్థ అధికారులతో కూడా మార్కెటింగ్‌ శాఖ అధికారులు మాట్లాడారు. నంద్యాల యార్డులో పంటలు కొనుగోలు చేసేందుకు వారు ముందుకు వచ్చినట్లు సమాచారం.  

జిల్లాలో 34వేల హెక్టార్లలో మిర్చి సాగవుతుండగా ఏటా 2లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. ఈ పంటను నిల్వ ఉంచడానికి తగినంత కోల్డ్‌ స్టోరేజ్‌లు లేవు. నంద్యాలలో 10, కోవెలకుంట్లలో 2, మహానందిలో 3, ఓర్వకల్లులో 2, నందికొట్కూరులో 1, ఆళ్లగడ్డలో 1..మొత్తం 19 కోల్డ్‌ స్టోరేజ్‌లు ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం లక్ష టన్నులకు మించి లేదు. దీంతో వ్యాపారులు గుంటూరు జిల్లాను ఆశ్రయించాల్సి వస్తోంది. నంద్యాలలో మిర్చి యార్డు ఏర్పాటైతే  కోల్డ్‌ స్టోరేజ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 

మిర్చి హబ్‌గా నంద్యాల... 
మిర్చియార్డు ఏర్పాటైతే  నంద్యాల మిర్చి హబ్‌గా మారనుంది. జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, నందికొట్కూరు, శ్రీశైలం, ఆదోని, పత్తికొండ, కర్నూలు, ఆలూరు, పాణ్యం, డోన్, కోడుమూరు, నంద్యాల నియోజకవర్గాల్లోని రైతులు గుంటూరుకు వెళ్లకుండా నంద్యాల మిర్చి యార్డుకు పంటను అమ్ముకొనేందుకు వస్తారు. జిల్లా రైతులే కాకుండా అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాల రైతులు కూడా నంద్యాలలో పంటను అమ్ముకునేందుకు వస్తారు. దీంతో నంద్యాల పట్టణంలో కోల్డ్‌ స్టోరేజ్‌ల సంఖ్య పెరగడమే కాకుండా, హమాలీలకు, లారీ డ్రైవర్లకు పనులు  దొరకడం, కమీషన్‌ వ్యాపారులు, రైతులతో నంద్యాల మార్కెట్‌యార్డు కిటకిటలాడే అవకాశం ఉంది. 

మిర్చి రైతుల ఇబ్బందులివీ.. 
మిర్చి పంటను అమ్ముకోవడానికి గుంటూరుకు వెళ్లాల్సి ఉండటం.  
గుంటూరులో బ్రోకర్‌కు రూ.లక్షకు రూ.3వేలు చెల్లించాలి.  
ధర వచ్చేంత వరకు మూడు, నాలుగు రోజులు అక్కడే ఉండాలి.  
ధర రాకపోతే  కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉంచడానికి బస్తాకు అదనంగా రూ.20 చెల్లించాలి.  
మిర్చిని తీసుకొని వెళ్లడానికి లారీకి రూ.20వేలు ఖర్చు. మూడు రోజులు ఆగితే రూ. 60వేలు బాడుగ చెల్లించాలి.

ఈ ఏడాదే ప్రారంభం
ఈ ఏడాది నుంచే నంద్యాల మార్కెట్‌ యార్డులో మిర్చి యార్డును ప్రారంభించి, కొనుగోలు చేస్తాం. మిర్చి యార్డుకు సంబంధించి రాష్ట్ర మార్కెటింగ్‌ కార్యదర్శి ప్రద్యుమ్నతో మాట్లాడాం. ఆయన అనుమతి ఇచ్చారు. కోల్డ్‌ స్టోరేజ్‌ నిర్వాహకులు, వ్యాపారులు, రైతులతో రెండుసార్లు సమావేశాలు నిర్వహించాం. మిర్చి వ్యాపారులకు లైసెన్స్‌లు మంజూరు చేస్తున్నాం. అన్నీ కుదిరితే డిసెంబర్‌ నెల నుంచే మిర్చి కొనుగోళ్లు ప్రారంభిస్తాం.  
– ఇసాక్‌బాషా, మార్కెట్‌యార్డు చైర్మన్, నంద్యాల 

రైతులకు ఉపయోగకరం
మిర్చి యార్డు ఏర్పాటు అయితే రైతులకు ఎంతో ఉపయోగకరం. గుంటూరుకు వెళ్లే ప్రయాస తగ్గుతుంది. జిల్లా రైతులే కాకుండా అనంతపురం, కడప, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రలోని మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులు కూడా నంద్యాలకు వచ్చి మిర్చి అమ్ముకునే అవకాశం ఉంది.  
– బీవీ రమణ,  హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్, నంద్యాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement