సాక్షి, విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 72వ గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మంత్రులు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రసంగిస్తూ... ‘ రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం స్పష్టమైన అజెండాతో ఉంది. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. భిన్నత్వంలో ఏకత్వం అనేది మా సిద్ధాంతం. కొందరు ప్రజల మధ్య శాంతిని చెడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి వారిని అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనే నవరత్నాల్లో ప్రకటించాం.
రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వారికోసం ఇళ్ల పట్టాల కార్యక్రమం ద్వారా డిసెంబర్ 25న 31 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాం. రెండు దశల్లో పేదలకు ఇళ్లు అందించే కార్యక్రమాలు పూర్తి చేస్తాం. ప్రతి నెలా ఒకటో తేదీనే అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్నాం. అధికార వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేస్తాం. విజయవాడను శాసన రాజధానిగా ఏర్పాటు చేస్తాం. కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తాం’ అని గవర్నర్ తెలిపారు.
గణతంత్ర వేడుకల్లో భాగంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన 14 శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. వివిధ శాఖలకు చెందిన శకటాలు ఆకట్టుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment