సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పేదల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అద్భుతమని ఢిల్లీ నేషనల్ డిఫెన్సు కళాశాల సీనియర్ డైరెక్టింగ్ స్టాఫ్, ఎయిర్ వైస్‌మార్షల్ మనీష్‌కుమార్ గుప్తా ప్రశంసించారు. ఢిల్లీలోని నేషనల్ డిఫెన్సు కళాశాలకు చెందిన సుమారు 20 మంది ప్రతినిధులతో కూడిన బృందం మనీష్‌కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో పర్యటించింది. ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పలువురు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. మనీష్‌కుమార్ మాట్లాడుతూ.. నేషనల్ డిఫెన్స్ కళాశాల ఫ్యాకల్టీ, కోర్సు సభ్యులతో కలిసి రెండ్రోజులుగా విశాఖపట్నం, అరకు తదితర ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య, మహిళ, రైతు సంక్షేమం తదితర రంగాల్లో అమలుచేస్తున్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు అక్కడి ప్రజలతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ ఎన్డీసీ బృందం పర్యటించి ఆక్కడ అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను పరిశీలించామని.. అయితే, ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే చాలా ముందంజలో ఉందని మనీష్‌కుమార్ కొనియాడారు.
విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగు..
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్యం, మహిళ, రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి పలు కార్యక్రమాలను అమలుచేస్తోందన్నారు. అలాగే, ప్రాథమిక విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యా, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. అలాగే, పేద ప్రజల సంక్షేమానికి పలు వినూత్న కార్యక్రమాలు, పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు.
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్..
ఇక రాష్ట్రంలో ఇంధన శాఖకు సంబంధించిన అంశాలపై ఎపీ ట్రాన్స్‌కో సీఎండీ కేవీఎస్ చక్రధర్‌బాబు వివరిస్తూ.. ప్రజలకు 24 గంటలూ యాక్ససబుల్, రిలయబుల్ విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని.. సుమారు 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఒకే దేశం ఒకే గ్రిడ్ నినాదంలో భాగంగా 5 గిగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని, ఐదు పంపు స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నామన్నారు. రాష్ట్ర ఇంధన రంగంలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు ఈ ఏడాది నాలుగు జాతీయ, మూడు అంతర్జాతీయ అవార్డులతో పాటు రాష్ట్రపతి అవార్డును కూడా సాధించామన్నారు. అనంతరం.. వ్యవసాయ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వ్యవసాయ శాఖ ఇన్‌ఛార్జి కమిషనర్ జి. శేఖర్‌బాబు వివరిస్తూ.. రాష్ట్ర జీడీపీలో 34 శాతం పైగా వాటా వ్యవసాయ రంగం నుంచే వస్తోందని చెప్పారు. రైతులకు అవసరమైన సేవలంని్నటినీ ఆర్బీకేల ద్వారా ఒకేచోట నుండి అందిస్తున్నామన్నారు.
కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు..
రాష్ట్రంలో వైద్యసేవలను రాష్ట్ర సెకండరీ హెల్త్ డైరెక్టర్ డా. వెంకటేశ్వర్ వివరిస్తూ.. రాష్ట్రంలో వైద్యపరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా ఎన్నడూలేని విధంగా 53 వేల పోస్టులను భర్తీచేయడంతోపాటు ఇంటివద్దకే మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి జరుగుతోందని వివరించారు. అలాగే.. కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment