స్టీల్ ప్లాంట్‌లో ట్యాంకర్‌కి లోడ్ చేస్తున్న లిక్విడ్ ఆక్సిజన్
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాణవాయువు ఉత్పత్తికి అత్యంత ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఆక్సిజన్ యూనిట్ పనులు పూర్తి చేసేందుకు ఫ్రెంచ్ సంస్థ.. ఎయిర్ లిక్విడ్ ఇండియా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎల్‌ఐహెచ్) అంగీకరించింది. రూ.85 కోట్లతో ప్లాంట్ నుంచి ఆక్సిజన్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. దీంతో మరో ఆక్సిజన్ యూనిట్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్‌లో ఐదు ఆక్సిజన్ యూనిట్లు ఉన్నాయి. పదేళ్ల క్రితం ఫ్రెంచ్ సంస్థ.. స్టీల్‌ప్లాంట్‌లో రోజుకు 850 టన్నులు ఉత్పత్తి చేసేలా ఆక్సిజన్ యూనిట్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది.
ఇందులో 100 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌కు సంబంధించి 2013 ఫిబ్రవరిలో పనులు ప్రారంభమయ్యాయి. 2016 నాటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు రూ.750 కోట్లు చెల్లించాలని స్టీల్‌ప్లాంట్‌ను ఏఎల్‌ఐహెచ్ డిమాండ్ చేసింది. దీనికి అంగీకరించని స్టీల్‌ప్లాంట్ 2017 అక్టోబర్‌లో ఆర్బిట్రల్ ట్రిబ్యునల్‌కు వెళ్లింది. దీనిపై పలుమార్లు విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ మే 1లోపు పనులు ప్రారంభించాలని ఏఎల్‌ఐహెచ్‌ను ఆదేశించింది. అంతేకాకుండా ఒప్పందం చేసుకున్న సమయంలో ఉన్న బుక్ వాల్యూ ప్రకారమే ప్లాంట్‌ని స్టీల్‌ప్లాంట్‌కు అప్పగించాలని స్పష్టం చేసింది. అయితే.. ఇతర పనులు పూర్తి చేసేందుకు స్టీల్ ప్లాంట్ తమకు రూ.85 కోట్లు చెల్లించాలని ఏఎల్‌ఐహెచ్ కోరగా ట్రిబ్యునల్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో దశలవారీగా రూ.85 కోట్లు చెల్లించనున్నామని స్టీల్‌ప్లాంట్ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల్లో ఫ్రెంచ్ కంపెనీ ప్రతినిధులు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని సందర్శించనున్నారని అధికారులు తెలిపారు. మే మొదటి వారంలో పనులు పూర్తి చేసి ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు.
2 వేల టన్నుల ఆక్సిజన్ సరఫరా..
కోవిడ్ నేపథ్యంలో స్టీల్‌ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సరఫరా ప్రారంభించారు. ఇటీవలే 103 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ని మహారాష్ట్రకు పంపారు. స్టీల్‌ప్లాంట్ నుంచి ఇప్పటివరకు మొత్తం 2 వేల టన్నుల ఆక్సిజన్‌ని సరఫరా చేశారు. తాజాగా కర్ణాటకకు 27 టన్నులు అందించారు. మొత్తం 5 యూనిట్లలో మూడింటి నుంచి రోజుకు 1,500 టన్నులు, రెండు యూనిట్ల నుంచి 1,200 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తవుతోందన్నారు. ఇందులో 2,600 టన్నులు ఆక్సిజన్ గ్యాస్ ఉత్పత్తవుతుండగా 100 టన్నులు 99.9 శాతం స్వచ్ఛమైన ద్రవ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. ఉత్పత్తిలో సింహభాగం రాష్ట్ర అవసరాలకే వినియోగిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment