ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు, పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఉత్తర అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 9వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో పార్వతీపురంలో 7 సెం.మీ, కురుపాం, వీరఘట్టం, బొబ్బిలి, గురుగుబెల్లిలో 5, పమిడి, బలిజిపేట, వేపాడ, సీతానగరం, పాలకొండ, అమలాపురంలో 3 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.
‘కృష్ణా’లో తగ్గిన వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో కృష్ణా, ఉప నదుల్లో వరద తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 41,436 క్యూసెక్కులకు ప్రవాహం తగ్గడంతో గేట్లను ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో పూర్తిగా మూసివేశారు. కుడి కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 27,460 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 7 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవాకు 1,350 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.8 అడుగుల్లో 214.36 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్‌లోకి 45,945 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 8,650, ఎడమ కాలువకు 5,782, ఏఎమ్మార్పీకి 1,800, ఎఫ్‌ఎఫ్‌సీకి 600 క్యూసెక్కులు వదులుతున్నారు.
విద్యుత్ కేంద్రం ద్వారా 29,142 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 45,828 క్యూసెక్కులు చేరుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 91,642 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలో గోదావరి నిలకడగా కొనసాగుతోంది. బ్యారేజీలోకి 1,52,376 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 1.41 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గొట్టా బ్యారేజీలోకి వంశధార వరద కొనసాగుతుండగా 7,500 క్యూసెక్కులను బంగాళాఖాతంలోకి వదులుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment